Modi mann ki baat: మోదీ మన్ కీ బాత్ వినలేదని.. 36 మంది నర్సింగ్ స్టూడెంట్లపై చర్యలు

36 Nursing Students Face Action For Not Listening To 100th Episode Of PM Modi Mann Ki Baat
  • చండీగఢ్ లోని వైద్య కళాశాలలో ఘటన
  • వారం పాటు హాస్టల్ నుంచి బయటకు వెళ్లేందుకు వీల్లేదంటూ ఆర్డర్
  • కాలేజ్ ఉన్నతాధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ వినలేదని కాబోయే నర్సులపై కాలేజ్ మేనేజ్ మెంట్ చర్యలు తీసుకుంది. హాస్టల్ లో ఉంటున్న సదరు విద్యార్థులు వారంపాటు బయటకు వెళ్లేందుకు వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. పదే పదే చెప్పినా, మన్ కీ బాత్ వినకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా సదరు విద్యార్థులు వినలేదని ఆరోపించింది. దీంతో చర్యలు తీసుకోక తప్పట్లేదని 36 మంది నర్సింగ్ స్టూడెంట్లకు నోటీసులు పంపించింది. చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మేనేజ్ మెంట్ ఈ చర్యలు తీసుకుంది.

ఏప్రిల్ 30న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం వినేందుకు మెడికల్ కాలేజీ ఏర్పాట్లు చేసింది. విద్యార్థులంతా తప్పకుండా ఈ కార్యక్రమం వినాలని ఆదేశించింది. కాలేజ్ సెమినార్ హాలులో ఏర్పాట్లు చేశామని, తప్పకుండా హాజరు కావాలని పదే పదే సూచించింది. హాజరుకాని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. మేనేజ్ మెంట్ ఆదేశాల మేరకు కాలేజ్ హాస్టల్ లోనూ వార్డెన్ స్టూడెంట్లకు తెలిపారు. అయినప్పటికీ నర్సింగ్ స్టూడెంట్లు 36 మంది మన్ కీ బాత్ వినే కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. దీంతో తాజాగా వారిపై చర్యలు తీసుకుంటూ కాలేజ్ మేనేజ్ మెంట్ నోటీసులు పంపించింది. వారం పాటు కాలేజ్ హాస్టల్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని అందులో పేర్కొంది.

మరోపక్క, మెడికల్ కాలేజ్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ మహువా మొయిత్రా ఈ ఘటనపై స్పందిస్తూ.. మోదీ మన్ కీ బాత్ ను తాను కూడా ఎప్పుడూ వినలేదని, మరి తనపైనా చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. తాను కూడా తన ఇంట్లో నుంచి వారం పాటు బయటకు వెళ్లకుండా నిషేధిస్తారా? అని ఆలోచిస్తుంటే భయమేస్తోందని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. చండీగఢ్ మెడికల్ కాలేజీ తీరుపై సోషల్ మీడియాలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Modi mann ki baat
100th episode
nursing students
PGIMER
chandigarh

More Telugu News