Karnataka: కర్ణాటక ఎన్నికల్లో రికార్డు సృష్టించిన గ్రామీణ ఓటర్లు!

Kural areas polled more than urban areas in Karnataka assembly polls
  • ఓటేయడానికి బద్ధకిస్తున్న నగర ఓటర్లు
  • బెంగళూరు అర్బన్ పరిధిలోని సీవీ రామన్ నగర్‌లో 47.4 శాతం ఓటింగ్ నమోదు
  • మెలుకోటె రూరల్‌లో 90 శాతానికిపైగా ఓటింగ్
  • రాష్ట్రంలో మొత్తంగా 72 శాతం ఓటింగ్ నమోదు
రెండు రోజుల క్రితం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగులో గ్రామీణ ఓటర్లు రికార్డు సృష్టించారు. పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫలితంగా నగర, పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. మాండ్యా జిల్లాలోని మెలుకోటె రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది.  జేడీఎస్ కంచుకోట అయిన ఇక్కడ 2018 ఎన్నికల్లో 90 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఇప్పుడు అంతకుమించి నమోదు కావడం ఓటర్ల చైతన్యానికి అద్దం పడుతోంది.

బెంగళూరు అర్బన్ పరిధిలోని 28 స్థానాల్లో ఒకటైన సీవీ రామన్ నగర్‌లో అత్యల్పంగా 47.4 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. గత ఎన్నికల్లో ఇక్కడ 51 శాతం ఓటింగ్ నమోదు కాగా ఇప్పుడు అంతకంటే తక్కువ నమోదైంది. ఈ స్థానాన్ని బీజేపీ వరుసగా మూడుసార్లు చేజిక్కించుకుంది. ఈ రెండు ఉదాహరణలను బట్టి అర్బన్ ప్రాంతాల ఓటర్ల కంటే గ్రామీణ ప్రాంత ఓటర్లలోనే చైతన్యం ఎక్కువ ఉన్నట్టు అర్థమవుతోంది. పట్టణ ప్రాంత యువతలో ఓటు వేయాలన్న ఉత్సాహం లేకపోవడాన్ని ఇది సూచిస్తోంది. 

గత ఎన్నికలు, తాజా ఎన్నికలు రెండింటిలోనూ గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కావడం గమనార్హం. అర్బన్ నియోజకవర్గాలతో పోలిస్తే రూరల్ నియోజకవర్గాల్లో పోలింగ్ 20 శాతానికిపైగా నమోదవుతోంది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే మొత్తంగా 72 శాతం పోలింగ్ నమోదైంది.
Karnataka
Karnataka Assembly Polls
Voter Turn Out

More Telugu News