Errabelli: స్వయంగా చెట్టు ఎక్కి కల్లు గీసిన మంత్రి ఎర్రబెల్లి... వీడియో ఇదిగో!

Minister Errabelli climb a tree and bring down Toddy pot
  • జనగామ జిల్లాలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి
  • పాలకుర్తి మండలం మల్లంపల్లిలో కల్లు గీత కార్మికుడి అవతారం ఎత్తిన వైనం
  • నిచ్చెన వేసుకుని చెట్టెక్కి కల్లు ముంత కిందికి దించిన ఎర్రబెల్లి
  • కల్లు గ్లాసులో పోసుకుని సేవించిన మంత్రి
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ జనగామ జిల్లాలో పర్యటించారు. పాలకుర్తి మండలం మల్లంపల్లిలో స్వయంగా గిరక తాటి చెట్టు ఎక్కి కల్లు గీశారు. నిచ్చెన వేసుకుని తాటి చెట్టు ఎక్కిన ఎర్రబెల్లి... అక్కడ కల్లుతో నిండి ఉన్న ముంతను కిందికి తీసుకువచ్చారు. ఆ తర్వాత అందులోని కల్లును గ్లాసులో పోసుకుని హాయిగా ఆస్వాదించారు. 

విశేషం ఏంటంటే... మంత్రి ఎర్రబెల్లి ఎక్కిన తాటిచెట్టు మూడేళ్ల కిందట ఆయన పంపిణీ చేసిందే. కల్లు గీత కార్మికులకు ప్రోత్సాహం అందించే క్రమంలో నాడు ఎర్రబెల్లి గిరక తాటి మొక్కలు పంపిణీ చేశారు. ఇప్పుడవి పెరిగి పెద్దవై, కల్లు అందిస్తున్నాయి. 

సాధారణ తాటిచెట్లు ఎంతో ఎత్తుకు పెరుగుతాయి. గిరక తాటిచెట్లు తక్కువ ఎత్తుతో, స్వల్పకాలంలోనే కల్లు గీతకు అందుబాటులోకి వస్తాయి. గిరక తాటిచెట్లు అయితే ఎక్కడం సులువుగా ఉంటుందని, ప్రమాదాలకు అవకాశం ఉండదని తెలంగాణ ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఈ తరహా తాటి చెట్లను పంపిణీ చేస్తోంది. ఇవి బీహార్ లో ఎక్కువగా కనిపిస్తాయి.
Errabelli
Toddy Pot
Tree
Janagama District
BRS
Telangana

More Telugu News