Pakistan: పాకిస్థాన్ లో అల్లర్లు.. ట్రావెల్ అడ్వైజరీ జారీ చేస్తున్న దేశాలు

  • పాక్ లో ఉన్న తమ పౌరులకు జాగ్రత్తలు చెప్పిన అమెరికా
  • పాస్ పోర్ట్ వెంట ఉంచుకోవాలని సూచించిన యూకే
  • రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించిన కెనడా
These Countries Issue Travel Advisory to Their Citizens in Pakistan

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు నేపథ్యంలో ఆ దేశంలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారు. చాలాచోట్ల వాహనాలకు నిప్పంటించారు. దేశం మొత్తం అల్లకల్లోలంగా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో ఉన్న తమ పౌరులకు ప్రపంచ దేశాలు జాగ్రత్తలు చెబుతున్నాయి. అమెరికా, కెనడా, యూకే తదితర దేశాలు తమ పౌరుల కోసం ట్రావెల్ అడ్వైజరీని జారీ చేశాయి. అల్లర్లు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి.

పాకిస్థాన్ లో ఉన్న అమెరికన్లు మరింత జాగ్రత్తగా ఉండాలని, తమ పాస్ పోర్ట్ లను వెంట తీసుకెళ్లాలని అమెరికా రాయబార కార్యాలయం సూచించింది. దేశంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు సంబంధించి రిపోర్టులు తెప్పించుకుంటున్నట్లు తెలిపింది. అల్లర్ల నేపథ్యంలో అన్ని సమావేశాలను రద్దు చేసినట్లు వివరించింది. ఆందోళనలకు దూరంగా ఉండాలని యూకే ఫారెన్ కామన్వెల్త్ అండ్ డెవలప్ మెంట్ ఆఫీస్ (ఎఫ్ సీడీఓ) తమ పౌరులకు సూచించింది.

స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, నిరసనలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల నుంచి వెంటనే దూరంగా వెళ్లాలని హెచ్చరించింది. శాంతియుత నిరసనలు కూడా క్షణాల వ్యవధిలో హింసాత్మకంగా మారే అవకాశం ఉందని చెప్పింది. పాకిస్థాన్ లో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని, కిడ్నాప్ లు జరగొచ్చని కెనడా తన పౌరులను హెచ్చరించింది. పాకిస్థాన్ లో ఉంటున్న కెనెడియన్లు జాగ్రత్తగా ఉండాలని, రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది.

More Telugu News