USA: అమెరికాలో మొబైల్ లాక్కున్న టీచర్ పై పెప్పర్ స్ప్రేతో స్టూడెంట్ దాడి.. వీడియో ఇదిగో!

US Teen Pepper Sprays Teacher After He Confiscates Her Phone Internet Outraged
  • క్లాసు వినకుండా మెసేజ్ చేస్తోందని టీచర్ ఆరోపణ
  • వద్దని చెప్పినా వినకపోవడంతో ఫోన్ లాక్కున్న టీచర్
  • ఫోన్ తిరిగివ్వాలంటూ టీచర్ పై దాడి చేసిన విద్యార్థిని
క్లాస్ రూంలో మొబైల్ ఫోన్ వాడద్దన్న టీచర్ పై ఓ విద్యార్థిని పెప్పర్ స్ప్రేతో దాడి చేసింది. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టెన్నెసీలోని నాష్ విల్లేలో అనిటోచ్ హైస్కూల్ లో క్లాస్ జరుగుతుండగా ఓ విద్యార్థిని గూగుల్ లో సమాధానాలు వెతకడం, మెసేజ్ లు చేయడం గమనించి ఆమె ఫోన్ లాక్కున్నాడా టీచర్. తన ఫోన్ తిరిగి ఇచ్చేయాలంటూ సదరు విద్యార్థిని ఆ టీచర్ పై పెప్పర్ స్ప్రేతో దాడి చేసింది. నొప్పి తట్టుకోలేక బాధపడుతున్న టీచర్ చేతుల్లో నుంచి తన ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్న టీచర్.. ఫోన్ తో సహా క్లాస్ బయటకు వెళ్లగా విద్యార్థిని కూడా ఫాలో అయ్యింది.

బయట మరోమారు పెప్పర్ స్ప్రేతో దాడి చేసింది. అయినప్పటికీ ఆ టీచర్ ఫోన్ ను మాత్రం తిరిగివ్వలేదు. ఇంతలో అక్కడికి వచ్చిన పక్క క్లాస్ టీచర్ కూడా విద్యార్థినికి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. టెన్నెసీలో క్లాస్ రూంలోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లడంపై నిషేధం లేకున్నా.. క్లాస్ జరుగుతుండగా ఫోన్ వాడకూడదనే రూల్ ఉంది. ఈ రూల్ ను ఉల్లంఘించడంతోనే ఫోన్ తీసేసుకున్నానని టీచర్ చెప్పారు.  

కాగా, ఓ వైపు తోటి విద్యార్థిని క్లాస్ టీచర్ పై దాడి చేస్తుంటే మిగతా స్టూడెంట్లు అదేదో జోక్ అయినట్లు నవ్వుతుండడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అమెరికాలో విద్యార్థులు తమ టీచర్లను గౌరవించట్లేదని, ఇదేం సంస్కృతని ఓ యూజర్ వాపోగా.. మరో యూజర్ మాత్రం సదరు స్టూడెంట్ ను వెంటనే స్కూలు నుంచి తొలగించాలని కామెంట్ చేశాడు. ఈ టీచర్ గతంలోనూ ఇలాగే ఓ స్టూడెంట్ నుంచి ఫోన్ లాక్కుని, ఆ స్టూడెంట్ చేతిలో దెబ్బలు తిన్నాడని విద్యార్థులు చెప్పడం కొసమెరుపు! 
USA
nashville
tennesse
student
pepper spray

More Telugu News