Imran Khan: పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి శ్రీలంక కంటే దారుణంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్

Imran Khan says Pakistan economy even worsen than Sri Lanka
  • పాక్ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించిందన్న ఇమ్రాన్
  • బలమైన ప్రభుత్వం వస్తేనే పాక్ బాగుపడుతుందని వ్యాఖ్యలు
  • జనరల్ ఖమర్ బజ్వా అవినీతిపరులతో దేశాన్ని నింపివేశాడని విమర్శలు
పాకిస్థాన్ లో ఆర్థిక పరిస్థితులు మరింత క్షీణించాయని, పాక్ ఆర్థిక వ్యవస్థ ఆఖరికి శ్రీలంక కంటే దారుణంగా మారిందని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన బలమైన ప్రభుత్వం పాక్ లో గద్దెనెక్కితే ఈ పరిస్థితిలో మార్పు రావొచ్చని అభిప్రాయపడ్డారు.  

పాకిస్థాన్ లో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక, రాజకీయ అస్థిరత పోవాలంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో, చిత్తశుద్ధితో ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే పరిష్కారం అని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. 

ఇటీవల బ్లూంబెర్గ్ సంస్థ పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై పేర్కొన్న నివేదికను ఇమ్రాన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. పాకిస్థాన్ ద్రవ్యోల్బణం రేటు శ్రీలంకను మించిపోతోందని బ్లూంబెర్గ్ వెల్లడించిందని తెలిపారు. ప్రపంచంలో ప్రతి చోట ద్రవ్యోల్బణం దిగొస్తోంది... ఒక్క పాకిస్థాన్ లో తప్ప అని వ్యాఖ్యానించారు. 

మాజీ సైనికాధికారి ఖమర్ బజ్వా ఏ శత్రువు చేయనంత నష్టాన్ని పాక్ కు కలుగజేశాడని ఇమ్రాన్ విమర్శించారు. పైసా విలువ చేయని అవినీతిపరులతో దేశాన్ని నింపేశాడని మండిపడ్డారు. 

క్యాబినెట్ లో 60 శాతం మంది అవినీతి కేసుల్లో బెయిల్ పై బయటున్న వారేనని వెల్లడించారు. ఈ దిగుమతి చేసుకున్న పాలకులు జాతీయ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Imran Khan
Pakistan
Sri Lanka
Economy

More Telugu News