Balakrishna: తెలంగాణలో టీడీపీ సత్తా చాటుతుంది: నందమూరి బాలకృష్ణ

Balakrishna attends Mini Mahanadu in Secunderabad
  • సికింద్రాబాద్ లో నిర్వహించిన మినీ మహానాడుకు హాజరైన బాలయ్య
  • తెలంగాణ ప్రజల గుండెల్లో టీడీపీ గూడు కట్టుకుని ఉందని వ్యాఖ్య
  • పార్టీ కోసం ఒక కార్యకర్తగా, ఎమ్మెల్యేగా పని చేస్తున్నానన్న బాలకృష్ణ
దివంగత ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. భారతరత్న ఎన్టీఆర్ కు కాకపోతే మరెవరికి ఇస్తారని ప్రశ్నించారు. సామాన్యుల కోసం ఎన్టీఆర్ ఎన్నో సాహసోపేతమైన పథకాలను అమలు చేశారని చెప్పారు. ఎందరో నాయకులకు రాజకీయ భిక్ష పెట్టిన ఘనత ఎన్టీఆర్ ది అని అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు యువత సేవా కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. సికింద్రాబాద్ లో నిర్వహించిన మినీ మహానాడులో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ గూడు కట్టుకుని ఉందని బాలయ్య చెప్పారు. సాంకేతికంగా ఏపీ, తెలంగాణ విడిపోయినా... ఎలాంటి భేదాలు లేకుండా అన్నదమ్ముల్లా కలిసి ఉందామని అన్నారు. పార్టీకి చెందిన కార్యక్రమాల్లో తనను ముఖ్య అతిథి అని సంబోధించవద్దని... పార్టీ కోసం తాను ఒక కార్యకర్తగా, ఒక ఎమ్మెల్యేగా పని చేస్తున్నానని బాలయ్య చెప్పారు. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Balakrishna
Telugudesam
Telangana

More Telugu News