Vasundhara Raje: అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన వసుంధర రాజే

  • తన ప్రభుత్వం కూలిపోకుండా వసుంధర రాజే అడ్డుకున్నారన్న అశోక్ గెహ్లాట్
  • ఆయన వ్యాఖ్యలు అవమానకరం, కుట్ర పూరితమన్న రాజే
  • రాజస్థాన్‌లో మరెవరూ ఇంతగా అవమానించలేదన్న బీజేపీ నేత
Vasundhara Rajes Counter After Ashok Gehlots Bombshell

తన ప్రభుత్వం కూలిపోకుండా బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, మరో ఇద్దరు బీజేపీ నేతలు సాయం చేశారంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన సంచలన వ్యాఖ్యలపై వసుంధర రాజే స్పందించారు. ఆయన వ్యాఖ్యలు ‘అవమానకరమని’, ‘కుట్రపూరితమని’ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్‌లో మరెవరూ అవమానించని విధంగా గెహ్లాట్ తనను అవమానించారని రాజే మండిపడ్డారు. 

 జులై 2020లో అప్పటి ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, 18 మంది ఆయన విధేయులు కలిసి గెహ్లాట్‌పై తిరగబడ్డారు. దీంతో రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం దాదాపు నెల రోజులపాటు కొనసాగింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జోక్యంతో సంక్షోభం చల్లబడింది. ఆ తర్వాత పైలట్‌ను ఉపముఖ్యమంత్రి పదవితోపాటు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. 

గెహ్లాట్ నిన్న మాట్లాడుతూ.. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు హోంమంత్రి అమిత్ షా, గజేంద్ర షెకావత్, ధర్మేంద్ర ప్రధాన్ కలిసి కుట్ర పన్నారని, కొందరు ఎమ్మెల్యేలకు డబ్బును ఎరగా చూపారని ఆరోపించారు. అప్పుడు వసుంధర రాజే, అసెంబ్లీ మాజీ స్పీకర్ కలాశ్ మేఘవాల్, ఎమ్మెల్యే శోభారాణి కుష్వాహా కలిసి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారని అన్నారు.

అప్పట్లో తాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్‌గా ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని, అది ఆమోదయోగ్యం కాకపోవడంతో తాను మద్దతు ఇవ్వలేదని గుర్తు చేసుకున్నారు. దీనికి ప్రతిగా 2020లో తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు వసుంధర రాజే మద్దతు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ తనను మూడుసార్లు ముఖ్యమంత్రిని చేసిందన్న గెహ్లాట్ .. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మరోమారు అధికారంలోకి తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News