Sukesh Chandrashekhar: కేజ్రీవాల్ ఇంట్లో ఖరీదైన ఫర్నీచర్ నేనే కొనిచ్చా: సుఖేష్ చంద్రశేఖర్

  • జైలు నుంచి చంద్ర శేఖర్ మరో సంచలన లేఖ విడుదల
  • ఇందుకోసం కోటి 70 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు ఆరోపణ  
  • దీనిపై దర్యాప్తు చేయించాలని ఢిల్లీ ఎల్జీ కి విజ్ఞప్తి
Conman Sukesh Chandrashekhar Big Claim On Arvind Kejriwal home Furniture

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ ఉన్న ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ జైలు నుంచి మరో లేఖ రాశాడు. కేజ్రీవాల్ అధికారిక నివాసానికి దాదాపు కోటి 70 లక్షల రూపాయాల ఫర్నీచర్ తానే కొనిచ్చినట్లు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కు కూడా ఇంటి సామన్లు కొనిచ్చినట్టు తెలిపాడు. మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం మండోలి జైల్లో సుకేష్.. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ వాళ్లకు నచ్చిన ఫర్నీచర్ ఫొటోలను తనకు వాట్సప్, ఫేస్ టైమ్ లో పంపేవారని, వాటిని తాను కొనుగోలు చేసి పంపించానని లేఖలో వెల్లడించాడు. సీఎం కేజ్రీవాల్ అధికార నివాసంలో ఫర్నీచర్ కోసం జరిగిన బిడ్డింగ్, ఖరీదైన ఫర్నీచర్ కు తానే డబ్బులు చెల్లించానని సుకేష్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు  మూడు పేజీల లేఖ రాశాడు. 

కేజ్రీవాల్ నివాసానికి 45 లక్షల విలువైన 12 సీట్ల డైనింగ్ టేబుల్, ఆయన పిల్లల బెడ్‌రూమ్‌లో రూ.34 లక్షల విలువైన డ్రెస్సింగ్ టేబుల్, రూ.18 లక్షల విలువైన ఏడు అద్దాలు, దాదాపు రూ.28 లక్షల విలువైన రగ్గులు, బెడ్‌ స్ప్రెడ్‌లు, దిండ్లతో పాటు 45 లక్షల విలువైన గోడ గడియారాలు పంపించానని తెలిపాడు. ఇటలీ, ఫ్రాన్స్ కు చెందిన ఈ ఇంపోర్టెడ్ ఫర్నీచర్ ను ఢిల్లీ, ముంబై బిల్స్ తో కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాడు. చెన్నై లోని తన నివాసానికి మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ వచ్చినప్పుడు ఇంట్లోని ఫర్నీచర్ ను ఫోటోలు తీసుకొని, కేజ్రీవాల్ కు చూపించడంతో అలాంటి ఖరీదైన ఫర్నీచర్ తనకు కావాలని సీఎం పట్టుబట్టారని లేఖలో రాసుకొచ్చాడు.

కేజ్రీవాల్ కోరిక మేరకు రూ. 90 లక్షల విలువైన వెండి పాత్రలు, గాజులు, కొన్ని విగ్రహాలను కూడా ఆయన అధికారిక నివాసానికి పంపించానని తెలిపాడు. కేజ్రీవాల్ నివాసంలోని ఖరీదైన సామగ్రిపై దర్యాప్తు చేపట్టాలని, ఆ వస్తువులకు సంబంధించిన బిల్లులు, తనకు సత్యేంద్ర జైన్, కేజ్రీవాల్ కు మధ్య జరిగిన వాట్సప్ చాట్స్ ను దర్యాప్తు సంస్థలకు అందజేస్తానని సుకేష్ పేర్కొన్నాడు.

More Telugu News