Apple: మా సంస్థలో లేఆఫ్స్ ఉండవు.. యాపిల్ సీఈఓ భరోసా

  • సంస్థలో పలు పొదుపు చర్యలు చేపడుతున్నామన్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్
  • గతంలో కంటే తక్కువ సంఖ్యలో కొత్త వారిని నియమించుకుంటున్నామని వెల్లడి
  • మరో మార్గం లేకపోతేనే లేఆఫ్స్ చేపడతామని స్పష్టీకరణ
Apple wont fire employees says CEO Tim Cook

‘యాపిల్‌లో’ ఉద్యోగుల తొలగింపులు ఇప్పట్లో ఉండవని సంస్థ సీఈఓ టిమ్ కుక్ భరోసా ఇచ్చారు. మారో మార్గం లేదన్న తరుణంలోనే సంస్థలో లేఆఫ్స్ చేపడతామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. టెక్ రంగంలో ప్రస్తుతం తొలగింపుల పర్వం నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ సంస్థలన్నీ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నా యాపిల్ మాత్రం ఈ ఒరవడికి మినహాయింపుగా నిలుస్తోంది.

కాగా, యాపిల్‌లో ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని సంస్థ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. ఉద్యోగులను తొలగించే బదులు తక్కువ సంఖ్యలో కొత్తవారిని నియమించుకుంటున్నట్టు తెలిపారు. ‘‘మేము కొత్త నియామకాలు చేపడుతున్నప్పటికీ గతంలో కంటే వేగం తగ్గించాము. పొదుపు చర్యల విషయంలో సరయిన దిశలోనే వెళుతున్నాము’’ అని ఆయన వివరించారు. 

ఇతర టెక్ సంస్థల్లా యాపిల్ భారీ స్థాయిలో తొలగింపులు చేపట్టనప్పటికీ ఏప్రిల్‌లో తన రిటైల్ విభాగంలో కొద్దిమందిని ఇంటికి సాగనంపింది. అయితే, మిగతా సంస్థలతో పోలిస్తే యాపిల్ పరిస్థితి మెరుగ్గానే ఉంది. కరోనా సమయంలో ఇతర టెక్ సంస్థల వలె భారీగా నియామకాలు చేపట్టకపోవడంతో యాపిల్ పరిస్థితి మెరుగ్గా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

More Telugu News