KCR: ఖమ్మం కలెక్టరేట్ ముట్టడికి పొంగులేటి యత్నం.. కేసీఆర్ పై విమర్శలు

  • పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పొంగులేటి డిమాండ్
  • తన అనుచరులతో కలిసి ఖమ్మం కలెక్టరేట్ ముట్టడికి యత్నం
  • రైతుల గోస కేసీఆర్ కు తగులుతుందని వ్యాఖ్య
Ponguleti fires on KCR

అకాల వర్షాలు, వడగళ్లతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ ముట్టడికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. తన అనుచరులతో కలిసి ఆయన కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకుని, గేట్లను మూసేశారు. అయితే కొందరు పొంగులేటి అనుచరులు గేట్లు తోసుకుని కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పొంగులేటి అనుచరులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఈ సందర్భంగా మీడియాతో పొంగులేటి మాట్లాడుతూ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని రైతులను ఆదుకోలేని కేసీఆర్ దేశాన్ని ఉద్ధరిస్తానని మాట్లాడుతున్నారని విమర్శించారు. అమ్మకు బువ్వ పెట్టలేనివాడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తానని చెపితే నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. రైతుల గోస కేసీఆర్ కు తగులుతుందని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 30 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ రైతుకు కష్టమొచ్చినా తాను ఉంటానని, వారికి మద్దతుగా నిలుస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News