Team India: డబ్ల్యూటీసీ ఫైనల్ ముంగిట ఆస్ట్రేలియాకు పుజారా వార్నింగ్

  • కౌంటీ క్రికెట్ లో దుమ్మురేపుతున్న భారత టెస్టు ఆటగాడు
  • ఇప్పటికే మూడు శతకాలు సాధించిన పుజారా
  • జూన్ 7 నుంచి ఓవల్ లో భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్
Pujaras warning for Australia before WTC final with consecutive Sussex hundreds

ఐపీఎల్ తర్వాత టీమిండియా ఇంగ్లండ్ లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. రెండేళ్ల కిందట న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్ ఈసారి ఎలాగైనా ట్రోఫీ నెగ్గాలని కోరుకుంటోంది. మరో నెల రోజుల్లో జరిగే ఈ మెగా ఫైనల్ కు ముందు టీమిండియా టెస్టు స్టార్ ఆటగాడు చతేశ్వర్ పుజారా.. ఆస్ట్రేలియా జట్టుకు హెచ్చరికలు పంపాడు. ప్రస్తుతం భారత స్టార్ క్రికెటర్లంతా ఐపీఎల్ లో బిజీగా ఉండగా.. టెస్టు జట్టులో అత్యంత కీలకమైన పుజారా మాత్రం కౌంటీ క్రికెట్ ఆడుతూ ఫామ్ కాపాడుకున్నాడు. అంతేకాదు సెంచరీల మీద సెంచరీలు కొడుతూ కంగారూ టీమ్ ను కంగారు పెడుతున్నాడు. 

35 ఏళ్ల పుజారా ఈ కౌంటీ సీజన్‌లో ససెక్స్ తరఫున బరిలోకి దిగాడు. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ శతక్కొట్టాడు. గత నెల ప్రారంభంలో డర్హామ్‌తో జరిగిన మ్యాచ్ లో 115 పరుగులు చేశాడు. ఏప్రిల్ 27న గ్లోస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 151 పరుగులతో రెండో సెంచరీ అందుకున్నాడు. ఇక నిన్న వోర్సెస్టర్‌షైర్‌ తో మొదలైన మ్యాచ్ లో పుజారా 189 బంతుల్లో 136 పరుగులతో మూడో సెంచరీ సాధించాడు. అతని ఇన్నింగ్స్ లో 19 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ క్రమంలో అతను ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డును కూడా సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 19 వేల పరుగుల మైలురాయి దాటిన భారత ఆరో క్రికెటర్ గా నిలిచాడు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వసీం జాఫర్ వంటి దిగ్గజ క్రికెటర్ల సరసన నిలిచాడు.

More Telugu News