Indians: అక్రమ మార్గాల్లో బ్రిటన్ కు... రిస్క్ తీసుకుంటున్న భారతీయులు

  • చిన్న పడవల్లో బ్రిటన్ చేరుకుంటున్న భారతీయులు
  • వీసాలు లేకుండానే బ్రిటన్ వెళ్లే ప్రయత్నం
  • ఆఫ్ఘన్ జాతీయుల తర్వాత భారతీయులే ఎక్కువమంది వస్తున్నారంటున్న బ్రిటన్
Indians tries to arrive UK in a illegal way

అమెరికా తర్వాత భారతీయులను అధికంగా ఆకర్షించే దేశం బ్రిటన్. భారత టెక్ నిపుణులకు, విద్యార్థులకు, వృత్తి నిపుణులకు బ్రిటన్ కూడా ద్వారాలు తెరుస్తోంది. అయితే బ్రిటన్ హోంమంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ ప్రజల తర్వాత బ్రిటన్ కు అక్రమంగా వలస వస్తున్న వారిలో అత్యధికులు భారతీయులేనట. 

చిన్న చిన్న పడవల్లో ఇంగ్లీష్ చానల్ దాటి బ్రిటన్ లో అడుగుపెట్టేందుకు రిస్క్ తీసుకుంటున్నారని యూకే హోంశాఖ వెల్లడించింది. బ్రిటన్ లో ఉపాధి అవకాశాల పట్ల ఆకర్షితులై పంజాబ్ కు చెందిన వారే అత్యధికంగా ఇలా పడవల్లో అక్రమంగా వస్తున్నారని వివరించింది. 

ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్యన 3,793 మంది చిన్న పడవల్లో బ్రిటన్ కు అక్రమంగా చేరుకోగా, వారిలో ఆఫ్ఘన్లు 909 మంది ఉండగా, భారతీయులు 675 మంది ఉన్నారట. 2022లో 683 మంది భారతీయులు ఫ్రాన్స్ మీదుగా పడవల్లో ఇంగ్లీష్ చానల్ దాటి అనుమతి లేకుండా బ్రిటన్ చేరుకున్నట్టు ఓ నివేదిక చెబుతోంది. 

ఇలా అక్రమ మార్గాల్లో బ్రిటన్ వస్తున్న వారిలో 18 నుంచి 35 ఏళ్ల పురుషులే ఎక్కువగా ఉన్నారని, బ్రిటన్ లో తమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఇలా ప్రమాదకరరీతిలో వస్తున్నారని నార్త్ అమెరికన్ పంజాబి అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చహల్ పేర్కొన్నారు. 

బ్రిటన్ వీసాలు పొందడం కష్టసాధ్యం కావడంతో, వారు చట్టబద్ధంగా రాలేకపోతున్నారని వివరించారు. ఇలా అక్రమంగా వచ్చేవారు మొదట ఫ్రాన్స్, గ్రీస్, సెర్బియా దేశాల వీసాలు పొందుతున్నారని, ఆపై ఆయా దేశాల నుంచి బ్రిటన్ కు సముద్ర మార్గంలో వస్తున్నారని తెలిపారు. ఫ్రాన్స్, గ్రీస్, సెర్బియా దేశాల వీసాలు పొందడం చాలావరకు సులువు అని సత్నామ్ సింగ్ వెల్లడించారు.

More Telugu News