Andhra Pradesh: తాగి వచ్చి అమ్మను కొడుతున్నాడు.. నాన్నకు బుద్ధి చెప్పరూ!: పోలీసులకు చిన్నారి ఫిర్యాదు

A nine year old boy complaint on his father in Karlapalem Bapatla district
  • బాపట్ల జిల్లా ఇస్లాంపేట పోలీస్ స్టేషన్ లో ఘటన
  • తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చిన ఎస్సై  
  • ఎస్సై శివయ్యతో బాలుడు మాట్లాడుతున్న వీడియో వైరల్
తండ్రి రోజూ తాగి వచ్చి తల్లిని కొడుతుంటే ఓ బాలుడు తట్టుకోలేకపోయాడు.. తండ్రికి బుద్ధి చెప్పండంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. జంకూగొంకూ లేకుండా ఎస్సైతో బాలుడు మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కర్లపాలెం మండలం ఇస్లాంపేట పోలీసు స్టేషన్ కు తొమ్మిదేళ్ల బాలుడు రహీమ్ వెళ్లాడు. బాలుడిని చూసిన ఎస్సై శివయ్య.. ఏం జరిగింది, ఎందుకు వచ్చావని ప్రశ్నించాడు. దీంతో మా నాన్నపై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. మా నాన్న రోజూ తాగి వచ్చి అమ్మను కొడుతున్నాడు.. ఎంత బ్రతిమిలాడినా వినడంలేదు. మా నాన్నకు మీరే బుద్ధి చెప్పాలని కోరాడు.

రహీమ్ తండ్రి సుభాని రైస్ మిల్లులో పనిచేయడంతో పాటు ఇంట్లో మిషన్ కుడతాడు. తల్లి సుభాంబీ ఇంట్లోనే ఉంటుంది. తాగుడుకు బానిసగా మారిన సుభానీ.. రోజూ తాగి వచ్చి ఇంట్లో గొడవ చేస్తూ సుభాంబీని కొడుతున్నాడు. రహీమ్ తో మాట్లాడిన తర్వాత ఎస్సై శివయ్య వెంటనే స్పందించారు. బాలుడి తల్లిదండ్రులను పిలిపించి గట్టిగా మందలించారు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మళ్లీ గొడవ పడినా, సుభాంబీని కొట్టినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సుభానిని హెచ్చరించి పంపించారు.
Andhra Pradesh
bapatla
karlapalem
kid police complaint
offbeat

More Telugu News