Siddipet District: సిద్దిపేట జిల్లాలో హృదయాన్ని పిండేసే ఘటన.. చితి పేర్చుకుని వృద్ధుడి ఆత్మహత్య!

  • వంతుల వారీగా తండ్రిని చూసుకోవాలని పెద్ద మనుషుల తీర్పు
  • జీర్ణించుకోలేకపోయిన పెద్దాయన
  • మరో కుమారుడి వద్దకు వెళ్తూ ఆత్మహత్య
90 year old committed suicide in Siddipet Telangana

కుమారులు తనను వంతులవారీగా పోషించడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ వృద్ధుడు తన చితిని తానే పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో జరిగిన ఈ ఘటన అందరి హృదయాలను పిండేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మెడబోయిన వెంకటయ్య (90)కు నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వెంకటయ్య భార్య గతంలోనే చనిపోయింది. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న కుమారులకు వెంకటయ్య తనకున్న నాలుగు ఎకరాల భూమిని పంచేశారు.

వృద్ధాప్య పింఛను తీసుకుంటూ గ్రామంలోనే ఉంటున్న పెద్ద కొడుకు కనకయ్య వద్ద వెంకటయ్య ఉండేవారు. అయితే, తండ్రి పోషణ బాధ్యత తనదొక్కడిదే కాదన్న విషయంలో ఐదు నెలల క్రితం గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఈ సందర్భంగా నెలకొకరు చొప్పున వంతుల వారీగా తండ్రిని చూసుకోవాలని పెద్ద మనుషులు తీర్పు చెప్పారు. 

గ్రామంలో పెద్ద కుమారుడి వద్ద ఉంటున్న వెంకటయ్య నెల రోజులు గడిచిపోవడంతో నవాబుపేటలో ఉంటున్న మరో కుమారుడి వద్దకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ నెల 2న సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంటికెళ్లి రాత్రికి అక్కడే ఉన్నారు. ఆయనతో ఆ రాత్రి తన బాధలు చెప్పుకున్నారు. తర్వాతి రోజు అక్కడి నుంచి బయలుదేరి నవాబ్‌పేటలోని కుమారుడి వద్దకు వెళ్తున్నట్టు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే,  సాయంత్రమైనా ఆయన అక్కడికి చేరుకోలేదు. నిన్న మధ్యాహ్నం గ్రామంలోని ఎల్లమ్మగుట్ట వద్ద మంటల్లో కాలిన స్థితిలో ఉన్న వెంకటయ్య మృతదేహం కనిపించింది. తాటికమ్మలను ఒక్కచోట కుప్పగా వేసి దానికి నిప్పంటించి అందులో దూకి వెంకటయ్య ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News