SRH: వరుణుడైనా రాకపోయె...!

  • సొంతగడ్డపై ఓటమిపాలైన సన్ రైజర్స్
  • కోల్ కతా నైట్ రైడర్స్ తో పోరులో 5 రన్స్ తేడాతో పరాజయం
  • ఆఖరి ఓవర్లో 9 పరుగులు కొట్టలేకపోయిన వైనం
  • వర్షంతో మ్యాచ్ ఆగిపోయినా బాగుండేదని భావించిన అభిమానులు!
  • ఓ దశలో డీఎల్ఎస్ స్కోరు సన్ రైజర్స్ కే అనుకూలం
  • జల్లుతో సరిపెట్టిన వరుణుడు
SRH lost to KKR in a nail biting match at Uppal

సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. కోల్ కతా నైట్ రైడర్స్ తో చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో సన్ రైజర్స్ 5 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 

ఆఖరి బంతికి ఓ సిక్స్ కొడితే సన్ రైజర్స్ గెలుస్తుందనగా, వరుణ్ చక్రవర్తి విసిరిన ఓ షూటర్ డెలివరీకి భువనేశ్వర్ కుమార్ తడబడ్డాడు. షాట్ సంగతి అటుంచితే కనీసం బ్యాట్ కు తాకించలేకపోయాడు. 

ఇటీవల చివరి ఓవర్లలో సిక్సర్ల వర్షం కురుస్తున్న వేళ సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో ఆఖరి 6 బంతుల్లో 9 పరుగులు కొట్టలేకపోవడం విచిత్రం. కనీసం వరుణుడు అడ్డంపడి మ్యాచ్ ఆగిపోతే సన్ రైజర్స్ నే విజయం వరిస్తుందని గణాంకాలు స్పష్టం చేశాయి. ఓ సమయంలో డీఎల్ఎస్ స్కోరు కంటే సన్ రైజర్స్ స్కోరే ఎక్కువగా ఉంది. కానీ వరుణుడు ఓ జల్లుతో సరిపెట్టుకున్నాడు. 

ఆఖరి ఓవర్ ను విసిరిన వరుణ్ చక్రవర్తి ప్రతిభను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. బ్యాట్స్ మెన్ ఊహకు అందని విధంగా బంతులేసి తికమకపెట్టాడు. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు మాత్రమే చేసింది. 

సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఒకరకంగా హైదరాబాద్ జట్టు ఓటమికి పరోక్షంగా అతడే కారకుడు! కీలక సమయంలో చెత్త షాట్ కొట్టి అవుటయ్యాడు. మార్ క్రమ్ అవుటయ్యాక వచ్చిన బ్యాట్స్ మెన్ ధాటిగా ఆడలేకపోయారు. 

కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో వైభవ్ అరోరా 2, శార్దూల్ ఠాకూర్ 2, హర్షిత్ రాణా 1, ఆండ్రీ రస్సెల్ 1, అనుకూల్ రాయ్ 1, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీశారు.

More Telugu News