Delhi Police: ఢిల్లీలో పోలీసుల అలర్ట్.. రహదారులపై బ్యారికేడ్లు

Delhi Police on alert barricades erected on roads to Jantar Mantar
  • నిన్న రాత్రి రెజ్లర్లు, పోలీసులకు మధ్య గొడవ
  • రెజ్లర్లకు మద్దతుగా ప్రజలు జంతర్ మంతర్ కు వస్తారని పోలీసులకు సమాచారం
  • అన్ని జిల్లాల డీసీపీలను అప్రమత్తం చేసిన ఉన్నతాధికారులు
దేశ రాజధానిలోని జంతర్ మంతర్, ఇతర రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సెంట్రల్ ఢిల్లీకి దారి తీసే అన్ని రహదారుల్లో బ్యారికేడ్లు ఏర్పాట్లు చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లు, కొంతమంది పోలీసు సిబ్బంది మధ్య నిన్నరాత్రి వాగ్వాదం జరగడంతో భారీగా పోలీసులను మోహరించారు. ఢిల్లీలోని అన్ని జిల్లాల డీసీపీలు తమ జిల్లాల్లో, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రెజ్లర్లకు మద్దుతుగా వివిధ రాష్ట్రాల నుంచి నుంచి జంతర్ మంతర్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకోవచ్చని పోలీసులకు సమచారం అందిందని తెలిపారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తం అయ్యారు. సెంట్రల్ ఢిల్లీ వైపు వెళ్లే రహదారులపై ప్రత్యేక శ్రద్ధ వహించామని, పలు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

 లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఏడుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించనుంది. బీజేపీ ఎంపీ బ్రిజ్ ను అరెస్టు చేసే వరకు తాము నిరసన వేదికను విడిచిపెట్టబోమని రెజ్లర్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి నిరసన శిబిరం వద్ద కొంతమంది పోలీసు సిబ్బంది తమతో అసభ్యంగా ప్రవర్తించారని, దుర్భాషలాడారని మహిళా రెజ్లర్లు ఆరోపించారు. కొంతమంది పోలీసులు మద్యం తాగి, మహిళా నిరసనకారులను తోసివేసి దుర్భాషలాడారని కూడా రెజ్లర్లు వాపోయారు. దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. నిరసన శిబిరం వద్దకు మడత మంచాలను తీసుకురాకుండా అడ్డుకోవడంతో రెజ్లర్ల మద్దతు దారులు  దూకుడుగా మారారని, ఇది గందరగోళానికి దారితీసిందని చెబుతున్నారు.
Delhi Police
Jantar Mantar
Wrestlers protest

More Telugu News