Uganda: ఉగాండాలో దారుణం: జీతం ఇవ్వలేదని.. మంత్రిని కాల్చిచంపి, ఆత్మహత్య చేసుకున్న అంగరక్షకుడు

  • రాజధాని కంపాలాలోని మంత్రి నివాసంలోనే ఘటన
  • ఆ తర్వాత గాల్లోకి కాల్పులు జరిపి తనను తాను కాల్చుకున్న గార్డు
  • ఘటనకు ముందు ఏం జరిగిందన్న విషయంలో స్పష్టత కరవు 
Soldier shoots dead politician he was guarding in Uganda

ఉగాండాలో దారుణం జరిగింది. జీతం ఇవ్వలేదని మంత్రిపై కోపం పెంచుకున్న అంగరక్షుడు ఆయనను కాల్చిచంపి, ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల్లో చనిపోయింది కార్మిక శాఖ సహాయ మంత్రి, రిటైర్డ్ కల్నల్ చార్లెస్ ఒకెల్లో ఎంగోలా కాగా, కాల్చి చంపింది విల్సన్ సబిజిత్. రాజధాని కంపాలాలోని మంత్రి నివాసంలో నిన్న జరిగిందీ ఘటన. 

మంత్రిని కాల్చిన అనంతరం సబిజిత్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు ముందు వారి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? అన్న విషయంలో స్పష్టత లేదు. సబిజిత్‌ను నెల రోజుల క్రితమే మంత్రి సెక్యూరిటీగా నియమించారు. కాగా, వేతనం చెల్లించకపోవడమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది.

సబిజిత్ తనను తాను కాల్చుకోవడానికి ముందు ఆ చుట్టుపక్కల కాసేపు తచ్చాడాడని, ఆ తర్వాత గాల్లోకి కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా, మంత్రి ఇంటిలో జరిగిన కాల్పుల ఘటనలో మంత్రి సహాయకుడు రొనాల్డో ఒటిమ్  గాయపడ్డారు. కంపాలాలోని ములాగో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కాల్పుల్లో మరికొందరు కూడా గాయపడినట్టు తెలుస్తోంది. ఘటన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున జనం గుమికూడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వంలో కల్నల్ ఎగోలా సీనియర్ సభ్యుడు. ఇంతకుముందు ఆయన రక్షణ శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు.

More Telugu News