Delhi Capitals: ఇది నిజం... ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గెలిచింది!

  • గుజరాత్ టైటాన్స్ కు షాకిచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్
  • ఉత్కంఠ పోరులో 5 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం
  • 131 పరుగుల లక్ష్యఛేదనలో 125 పరుగులే చేసిన గుజరాత్
  • పాండ్యా ఒంటరిపోరు వృథా
  • చివరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇషాంత్ శర్మ
Delhi Capital outshines IPL table topper Gujarat Titans by 5 runs

ఐపీఎల్ తాజా సీజన్ లో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ తో, ఓటమికి పర్యాయపదంగా మారిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడుతోందంటే... గుజరాతే గెలుస్తుందని చాలామంది ముందే డిసైడ్ అయిపోయారు. ఆ... ఢిల్లీ మ్యాచే కదా... ఏంచూస్తాంలే అని అసలు చాలామంది స్టేడియంకు కూడా రాలేదు. 

కానీ అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ 5 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై అద్భుత విజయం సాధించింది. తాము సాధించింది 130 పరుగులే అయినా, దాన్ని కాపాడుకున్న తీరు అమోఘం. 131 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 125 పరుగులే చేసి ఓటమిపాలైంది. 

కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నప్పటికీ ఆ జట్టుకు గెలుపు సాధ్యం కాలేదు. పాండ్యా 59 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. ఆఖర్లో కొంత హైడ్రామా నెలకొంది. గుజరాత్ టైటాన్స్ 12 బంతుల్లో 33 పరుగుల చేయాల్సి ఉండగా... నోర్కియా బౌలింగ్ లో తెవాటియా వరుసగా మూడు భారీ సిక్సులు కొట్టి మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. 

చివరి ఓవర్ లో ఆ జట్టుకు 12 పరుగులు అవసరం కాగా... ఇషాంత్ శర్మ సూపర్ బౌలింగ్ తో టైటాన్స్ కు అడ్డుకట్ట వేశాడు. తెవాటియాను అవుట్ చేయడమే కాకుండా, కేవలం 6 పరుగులే ఇచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ కు స్ఫూర్తిదాయక విజయాన్ని అందించాడు. 

అసలు, ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ఆరంభం కూడా ఢిల్లీ జట్టు తరహాలోనే ఒడిదుడుకుల మధ్య సాగింది. ఓ దశలో గుజరాత్ 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే పాండ్యా, అభినవ్ మనోహర్ (26) ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. 

మనోహర్ అవుటైన తర్వాత వచ్చిన తెవాటియా 7 బంతుల్లోనే 20 పరుగులు చేసి టైటాన్స్ కు విజయంపై ఆశలు కల్పించాడు. కానీ ఇషాంత్ శర్మ విసిరిన చివరి ఓవర్ గుజరాత్ కు నిరాశనే మిగిల్చింది.

More Telugu News