Hyderabad: హైదరాబాద్ లో మరో విషాదం.. నీటి గుంతలో పడి బాలుడి మృతి

  • జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో ప్రమాదం
  • ఆడుకుంటూ నీటి గుంతలో పడ్డ వివేక్
  • తల్లిదండ్రులు వచ్చి బయటకు తీసేలోపే ఆగిన ఊపిరి
  • కన్నీరుమున్నీరుగా రోదిస్తున్న వివేక్ తల్లి
six years old dead after falling in water pit in jubleehills

హైదరాబాద్ లో మరో విషాదం చోటుచేసుకుంది. నాలాలో పడి చిన్నారి మౌనిక చనిపోయిన సంగతి మరవకముందే మరో దారుణం జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు వివేక్ మరణించాడు. స్నేహితులతో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ గుంతలో పడి మునిగిపోయాడు. అక్కడికి దగ్గర్లోనే ఉన్న బాలుడి తల్లిదండ్రులు వచ్చి బయటకు తీసేలోగా ఊపిరి అందక కన్నుమూశాడు.

రోడ్డుపై నిలిచే వరద నీటిని తొలగించడం కోసం తీసిన గుంత ఈ ప్రమాదానికి కారణమైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ గుంత నిండిపోయిందని, దానిపై ఉన్న కర్రమీదికి ఎక్కే ప్రయత్నంలో పట్టుతప్పి వివేక్ నీటి గుంతలో పడిపోయాడని తోటి పిల్లలు చెబుతున్నారు. అక్కడికి దగ్గర్లోనే ఉన్న ఓ షోరూంలో వివేక్ తల్లిదండ్రులు పనిచేస్తారని సమాచారం. వివేక్ గుంతలో పడిపోయాడని పిల్లలు వచ్చి చెప్పడంతో బాలుడి తల్లిదండ్రులు పరుగెత్తుకెళ్లారు. గుంతలో నుంచి వివేక్ ను బయటకు తీయగా.. అప్పటికే వివేక్ లో చలనం ఆగిపోయిందని స్థానికులు తెలిపారు.

కొత్త బట్టల కోసం మారాం చేశాడు.. వివేక్ తల్లి
ఉదయం స్నానం చేశాక కొత్త బట్టలు వేయాలని మారాం చేశాడని వివేక్ తల్లి చెప్పింది. పుట్టిన రోజు నాడు తొడుగుతానని చెప్పినా వినకపోవడంతో కొత్త బట్టలు వేసి తాను పనికి వచ్చానని తెలిపింది. అదే తనకు చివరిచూపు అవుతుందని అనుకోలేదంటూ కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

More Telugu News