Ch Malla Reddy: ఏపీ రాజకీయాలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్

TS Minister Mallareddy sensational comments on Caste centric politics in AP
  • కార్మిక దినోత్సవంలో మంత్రి మల్లారెడ్డి ప్రసంగం
  • ఏపీలో కుల రాజకీయాలు నడుస్తున్నాయని కామెంట్
  • ఏపీ ప్రజలను ఆదుకునేది కేసీఆర్‌యేనని స్పష్టీకరణ
  • పోలవరం కట్టేది, విశాఖ ఉక్కును కాపాడేది బీఆర్ఎస్ అధినేతేనని వ్యాఖ్య
తెలంగాణ ప్రభుత్వం, కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్మిక దినోత్సవంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రస్తుతం కులాల పేరిట రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. రెడ్డి రాజకీయం, కమ్మ రాజకీయం, కాపు రాజకీయం, ఇలా వేరు వేరు రాజకీయాలు నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల బాగు కోసం సీఎం కేసీఆర్ అహరహం శ్రమిస్తున్నారన్న మల్లారెడ్డి, ఏపీ ప్రజలను ఆదుకునేది కూడా కేసీఆర్‌యేనని స్పష్టం చేశారు. పోలవరం కట్టేది, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడేది కూడా కేసీఆర్ అని ఉద్ఘాటించారు.

ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు కూడా తమకు కేసీఆర్ లాంటి సీఎం కావాలని కోరుకుంటున్నట్టు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఐటీ మంత్రి కేటీఆర్ లాంటి డైనమిక్ మినిస్టర్ యావత్ దేశంలో లేరని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ చర్యల కారణంగా ప్రస్తుతం ఐటీ రంగంలో హైదరాబాద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోందన్నారు. రాష్ట్రంలో వృద్ధులకు పింఛన్లు ఇస్తూ కేసీఆర్ వారికి ఓ పెద్దకొడుకులా అండగా నిలుస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ ప్రాంతంలోనూ లేనన్ని సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న వారందరూ గాలికి కొట్టుకుపోతారని వ్యాఖ్యానించారు.
Ch Malla Reddy
Telangana
Andhra Pradesh

More Telugu News