Indus valley civilisation: రాజమౌళికి ఆనంద్ మహీంద్రా కీలక సూచన.. స్పందించిన దిగ్గజ దర్శకుడు

Rajamouli reacts as Anand Mahindra asks him to make film on Indus valley civilisation
  • సింధు నాగరికతపై సినిమా తీయాలని కోరిన ఆనంద్ మహీంద్రా
  • అద్భుత నాగరికతను ప్రపంచానికి తెలియజేయాలని పిలుపు
  • ఆయా ప్రాంతాలను సందర్శించడంలో ఇబ్బందులు ఉన్నాయన్న రాజమౌళి
సామాజికంగా చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా.. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళికి ఓ కీలక సూచన చేశారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల ద్వారా రాజమౌళి తన దర్శక ప్రతిభను యావత్ దేశంతోపాటు ప్రపంచానికి చాటి చెప్పడం తెలిసిందే. ఈ రెండూ చారిత్రక నేపథ్యం ఉన్న కథనాలే. దీంతో ఆనంద్ మహీంద్రా ఓ ముఖ్యమైన సూచన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండస్ వ్యాలీ (సింధు) నాగరికతపై ఓ సినిమా చేయాలని రాజమౌళికి ఆనంద్ మహీంద్రా సూచించారు. 

హరప్ప, మొహెంజో దారో, దోలావిరా, లోతాల్, కాలిబంగన్, బనావలి, రాఖిగర్హి, సుర్కోటడ, చన్హుదారో, రూపర్ తదితర ప్రాంతాల గొప్ప ప్రాచీన నాగరికతకు నిదర్శనాలుగా నిలుస్తాయి. ఒక్కో ప్రాంతం వారీ ఒక్కో పెయిటింగ్ ఫొటోను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ హ్యాండిల్ పై పోస్ట్ చేశారు. ‘‘ఇలాంటి అద్భుతమైన ఉదాహరణలు చరిత్రను సజీవంగా, చురుగ్గా ఉంచుతాయంటూ.. ఆ కాలంపై ఓ సినిమా చేయడాన్ని ఎస్ఎస్ రాజమౌళి పరిశీలించాలి. అది ప్రాచీన నాగరికతపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తుంది’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 

దీనికి రాజమౌళి వెంటనే స్పందించారు. ‘‘అవును సర్. దోలావియాలో మగధీర సినిమా చిత్రీకరణ సందర్భంగా చాలా పురాతనమైన చెట్టును చూశాను. అది శిధిలంగా మారింది. సింధు నాగరికత వర్ధిల్లడం, పతనం కావడానికి ఆ చెట్టు నిదర్శనంగా నిలిచింది. ఆ తర్వాత పాకిస్థాన్ కు కూడా వెళ్లాను. మొహెంజోదారోను సందర్శించేందుకు ఎంతో ప్రయత్నించాను, కానీ అనుమతి నిరాకరించారు’’ అని రాజమౌళి ఆనంద్ మహీంద్రా సూచనకు బదులిచ్చారు. నాగరికత గురించి తెలుసుకునే ప్రయత్నాలకు ఉన్న అడ్డంకులను రాజమౌళి ప్రస్తావించినట్టయింది. మరి భవిష్యత్తలో అయినా ఆనంద్ మహీంద్రా సూచనకు రాజమౌళి దృశ్య రూపం కల్పిస్తారేమో చూడాల్సి ఉంది.
Indus valley civilisation
Anand Mahindra
ss Rajamouli
director
movie
advised

More Telugu News