Nirmal District: పెళ్లింట్లో చోరీ.. పేద కుటుంబానికి గ్రామస్థుల చేయూత

  • తెలంగాణలోని నిర్మల్ జిల్లా కిర్గుల్ లో ఘటన
  • పేదింటి ఆడపిల్ల పెళ్లి జరిపించేందుకు ఒక్కటైన ఊరి జనం
  • తలా కొంత సాయం చేసి రూ.1.5 లక్షలు అందజేసిన వైనం
Kirgul villagers donate rs 150000 for poor girl wedding in Nirmal district

పది రోజుల్లో పెద్ద బిడ్డ పెళ్లి.. తినీ తినకా దాచుకున్న సొమ్ముకు తోడు నాలుగు చోట్ల అప్పు చేసి కొంత బంగారం కొనుగోలు చేసిందా కుటుంబం. కొంత సొమ్మును ఖర్చుల కోసం ఇంట్లో దాచింది. అయితే, రాత్రిపూట చొరబడ్డ దొంగలు ఇంట్లో ఉన్నవన్నీ ఊడ్చుకెళ్లారు. తెల్లారి లేచాక దొంగతనం జరిగిన సంగతి గుర్తించి ఆ కుటుంబ సభ్యులు లబోదిబోమన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో బిడ్డ పెళ్లి ఎలా చేయాలని కన్నీరుమున్నీరుగా రోదించారు. వాళ్ల ఏడుపు చూసి ఊరంతా కన్నీరు పెట్టింది. ఎలాగైనా సరే ఆ ఆడపిల్ల పెళ్లి జరిపించాలని గ్రామాభివృద్ధి కమిటీ నిర్ణయించింది. తలా కొంత జమచేసి ఆ పేద కుటుంబానికి అందజేసింది. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో జరిగిందీ ఘటన..

నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్ (బి)కు చెందిన కరాండె గోదావరి, గంగన్న దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. గ్రామంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న గంగన్న ఆదాయం అంతంత మాత్రమే. కుటుంబ పోషణ కష్టంగా మారడంతో గోదావరి కూలి పనులకు వెళుతోంది. ఇటీవల పెద్ద కూతురుకు పెళ్లి కుదిరింది. మే 7న వివాహానికి ముహుర్తం నిర్ణయించారు. పెళ్లి ఖర్చుల కోసం తెలిసిన వారి వద్ద అప్పు చేసిన గంగన్న.. కొంత బంగారంతో పాటు పెళ్లి సామగ్రి కొని ఇంట్లో పెట్టుకున్నారు.

బుధవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయాక దొంగలు చొరబడి బీరువాలోని రూ.50 వేల నగదు, 2 తులాల బంగారం, 20 తులాల వెండి ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయాన్నే లేచిన గంగన్న కుటుంబ సభ్యులు ఇంట్లో దొంగలు పడ్డ విషయం గుర్తించి కన్నీటిపర్యంతమయ్యారు. గంగన్న కుటుంబ పరిస్థితి తెలిసిన ఊరి వాళ్లు తామున్నామని ముందుకొచ్చారు. వీడీసీ ఆధ్వర్యంలో చైర్మన్ పోతారెడ్డి రూ.90,000 వేలు, సర్పంచ్ సుధాకర్ రెడ్డి రూ.50,000 వేలు, మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి రూ.10 వేలు.. మొత్తంగా రూ.1.50 లక్షలు అందజేశారు.

More Telugu News