BRS: మహారాష్ట్రలో తొలి ఎన్నికలోనే బీఆర్‌ఎస్‌కు భారీ షాక్​

  • ప్రఖ్యాత భోకర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఎన్నికల్లో పోటీ పడ్డ బీఆర్ఎస్
  • 18 డైరెక్టర్ పదవుల్లో ఒక్కటి కూడా గెలవలేకపోయిన గులాబీ పార్టీ
  • కాంగ్రెస్ మద్దతు దారులకు దక్కిన 13 స్థానాలు
BRS fails in its first election in maharastra

జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత పొరుగు రాష్ట్రంలో పోటీ పడ్డ తొలి ఎన్నికల్లోనే బీఆర్‌ఎస్‌ చతికిల పడింది. మహారాష్ట్రలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణకు సరిహద్దున నాందేడ్‌ జిల్లాలోని భోకర్‌ తాలూకాలో ఉన్న ప్రఖ్యాత భోకర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ 18 డైరెక్టర్‌ పదవులకు జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు పరాజయం పాలయ్యారు. ఒక్కటంటే ఒక్క డైరెక్టర్ పదవిలో కూడా నెగ్గలేకపోయింది. ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ మద్దతుదారులు 13 స్థానాలు గెలుచుకోగా.. ఎన్సీపీకి రెండు వచ్చాయి. 

బీజేపీ బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు డైరెక్టర్‌ పదవులను కైవసం చేసుకున్నారు. ఈ మార్కెట్‌పై పట్టున్న నాగ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. భోకర్‌ మార్కెట్‌కు నాందేడ్‌ జిల్లాలోనే అతిపెద్దదనే పేరుంది. చాలా మంది రాజకీయ ప్రముఖులు ఈ మార్కెట్‌ కమిటీ ఎన్నికల నుంచే తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పైగా, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చవాన్‌ నియోజకవర్గం(భోకర్‌) పరిధిలో ఉన్న ఈ మార్కెట్ కమిటీలో నెగ్గి ఆ రాష్ట్రంలో తమ రాకను చాటుకోవాలని బీఆర్ఎస్ భావించింది. కానీ, నాగ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో బరిలోకి దిగిన 18 మంది అభ్యర్థులు ఎన్ని హామీలు ఇచ్చినా విజయం సాధించలేకపోవడం చర్చనీయాంశమైంది.

More Telugu News