Vinotbabu: వీల్‌చైర్ క్రికెట్‌ కెప్టెన్‌నంటూ తమిళనాడు సీఎం స్టాలిన్‌ నే బురిడీ కొట్టించిన మోసగాడు!

Case Filed Against Vinod Babu For Cheating Tamil Nadu CM Stalin
  • తన సారథ్యంలోని భారత జట్టు ఆసియాకప్‌ను సొంతం చేసుకుందంటూ ప్రచారం
  • మంత్రులు సహా పలువురి నుంచి ఆర్థిక సాయం
  • గతవారం టీ20 ప్రపంచకప్‌ను కూడా గెలుచుకున్నామంటూ కప్‌తో సీఎంను కలిసిన వైనం
  • అతడు చెప్పేవన్నీ అబద్ధాలంటూ సమాచారం
  • భారత వీల్‌చైర్ క్రికెట్ జట్టుకు, వినోద్‌కు ఎలాంటి సంబంధమూ లేదని తేలిన వైనం
  • మోసం ఫిర్యాదుపై కేసు నమోదు
మాయమాటలతో ఓ కేటుగాడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌నే బురిడీ కొట్టించాడు. మంత్రులు సహా మరికొందరి నుంచి ఆర్థిక సాయం కూడా అందుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామనాథపురం జిల్లా కడలాడి తాలూకాలోని కీళచెల్వనూర్‌కు చెందిన వినోద్‌బాబు దివ్యాంగుడు. భారత వీల్‌చైర్ క్రికెట్ జట్టుకు సారథ్యం వహిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నాడు.

తన సారథ్యంలోని భారత జట్టు గతేడాది జరిగిన ఆసియాకప్‌ను సొంతం చేసుకున్నట్టు చెబుతూ మంత్రులు రాజకన్నప్పన్, ఉదయనిధి స్టాలిన్‌ను కలిశాడు. అలాగే, గతవారం లండన్‌లో జరిగిన టీ-20ప్రపంచకప్‌ను కూడా గెలుచుకున్నామంటూ ఓ కప్‌తో సీఎం స్టాలిన్‌ను, మంత్రి రాజకన్నప్‌ను కలిశాడు. దీంతో సీఎం ఆయనను అభినందించారు.

మరోవైపు, వినోద్‌బాబు మోసకారి అని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలంటూ చెన్నై సచివాలయానికి సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలు వినోద్‌బాబుకు, భారత వీల్‌చైర్ క్రికెట్ జట్టుకు ఎలాంటి సంబంధమూ లేదని, అతడికసలు పాస్‌పోర్టు కూడా లేదని తేలింది. తనను తాను భారత వీల్‌చైర్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా చెప్పుకుని మోసాలకు పాల్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు.

వినోద్‌బాబు మాటలు నమ్మి ఛత్రకుడికి చెందిన ఓ బేకరీ యజమాని లక్ష రూపాయలు ఇచ్చాడు. పలువురు మంత్రులు కూడా అతడికి ఆర్థిక సాయం చేసినట్టు సమాచారం. రామనాథపురం ఏబీజే మిసైల్స్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శరవణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు వినోద్‌బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Vinotbabu
MK Stalin
Tamil Nadu
Wheel Chair Cricket

More Telugu News