Kerala: రెండో శతాబ్దం నుంచే కేరళతో యూరోపియన్ల వాణిజ్య సంబంధాలు!

  • హైదరాబాద్ సీడీఎఫ్‌డీ అధ్యయనంలో వెల్లడి
  • కేరళలోని ‘పట్టణం’తో వేల ఏళ్ల క్రితమే వాణిజ్య లావాదేవీలు
  • ‘పట్టణం’.. నౌకా కేంద్రం ముజిరిస్ రెండూ ఒకేటనని నిర్ధారణ
  • రెండు నుంచి పదో శతాబ్దం వరకు ‘పట్టణం’ వివిధ దేశాల ప్రజల నివాసం
Ancient DNA study confirms West Eurasian genetic imprints in Pattanam

విదేశీ వాణిజ్యం మనకేమీ కొత్తకాదని, అది రెండో శతాబ్దం నుంచే ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. కేరళలోని తీర ప్రాంత నగరమైన ‘పట్టణం’తో రెండో శతాబ్దం నాటికే యూరోపియన్లు వాణిజ్యం చేసేవారని హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (సీడీఎఫ్‌డీ) డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ తెలిపారు. వాణిజ్య లావాదేవీలే కాకుండా మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, గ్రీస్, రోమ్‌కు చెందిన వారు ‘పట్టణం’లో నివసించేవారని తమ అధ్యయనంలో తేలినట్టు చెప్పారు.

‘పట్టణం’తో ఆసియా-యూరప్ ఖండాల మధ్య ఉన్న దేశాల ప్రజలకు సుదీర్ఘకాలంపాటు వాణిజ్య సంబంధాలు ఉన్నట్టు తేలిందన్నారు. వేల ఏళ్ల క్రితమే నౌకా కేంద్రంగా విరాజిల్లిన ముజిరిస్ నగరం, ఎర్నాకుళంలోని ‘పట్టణ’మేనని చరిత్రకారులు చెబుతున్నారు. దీంతో ఈ రెండూ ఒకటేనా అన్న దానిపై చాలా కాలంగా అధ్యయనాలు జరుగుతున్నాయి. తాజా అధ్యయనంలో ఈ రెండూ ఒకటేనని తేలిందని తంగరాజ్ చెప్పారు. ‘పట్టణం’లో లభించిన పురాతన వస్తువులపై జరిపిన జన్యుపరమైన అధ్యయనం ద్వారా ఈ విషయం తెలిసిందన్నారు. రెండో శతాబ్దం నుంచి పదో శతాబ్దం వరకు గ్రీస్, రోమ్‌ సహా పలు దేశాల ప్రజలు అక్కడ నివసించినట్టు అధ్యయనంలో నిర్ధారణ అయినట్టు తంగరాజ్ తెలిపారు.

More Telugu News