Raja Singh: టీడీపీలోకి రాజాసింగ్?.. ముఖ్య నేతలతో చర్చలు జరిపినట్లు ప్రచారం!

MLA Raja Singh is making arrangements to join Telangana TDP
  • టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను రాజాసింగ్ కలిసినట్లు ప్రచారం
  • రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చర్చ
  • గతంలో టీడీపీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాజాసింగ్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. తెలంగాణలో ‘హిందుత్వ’కు బ్రాండ్ అంబాసిడర్. ఆ రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఉండేవారు. కానీ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ను బీజేపీ బహిష్కరించింది. ఆరు నెలలు దాటినా ఇప్పటికీ ఆ పార్టీ ఆయన్ను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మరో పార్టీలో చేరాలని రాజాసింగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే రాజాసింగ్‌ త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాను రాజకీయంగా కెరియర్ ప్రారంభించిన టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చర్చ సాగుతోంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను ఆయన రెండు రోజుల క్రితం వ్యక్తిగతంగా కలిసి చర్చలు జరిపినట్లు సమాచారం.

మరో రెండు మూడు రోజుల్లో రాజాసింగ్‌కు మార్గం సుగమం అవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గోషామహాల్‌ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తన అనుచరులతో టీడీపీలో చేరేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది.

గోషామహల్‌ నియోజకవర్గంతోపాటు మరో మూడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు తన పూర్తి సహకారం అందిస్తానని రాజాసింగ్‌ చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడి, రెండుమూడు రోజుల్లో పార్టీలోకి ఆహ్వానించేలా ఏర్పాట్లు చేస్తామని టీడీపీ ముఖ్య నేత ఒకరు చెప్పినట్లు రాజాసింగ్‌ అనుచరులు చర్చించుకోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

రాజాసింగ్‌ 2009లో తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ తరపున 2009 నుంచి 2014 వరకు కార్పొరేటర్‌గా పనిచేశారు. తర్వాత బీజేపీలో చేరి 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి వరుసగా రెండోసారి గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఒకే ఒక్కరు రాజాసింగ్ కావడం గమనార్హం.
Raja Singh
TTDP
kasani gnaneshwar
BJP

More Telugu News