Rajasthan Royals: ధోనీ వ్యూహాలు పనిచేయలేదు... చెన్నై ముందు భారీ టార్గెట్

  • జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ × చెన్నై సూపర్ కింగ్స్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు చేసిన రాజస్థాన్
  • 43 బంతుల్లో 77 పరుగులు చేసిన జైస్వాల్
  • ఆఖర్లో చిచ్చరపిడుగులా ఆడిన ధృవ్ జురెల్
Rajasthan Royals set CSK huge target

జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు విఫలమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ ను వారు కట్టడి చేయలేకపోయారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు చేసింది. మొదట రాజస్థాన్ యువ ఓపెనర్ యశస్వి  జైస్వాల్ దుమ్ము దులపగా, ఆఖర్లో ధృవ్ జురెల్ చిచ్చరపిడుగులా చెలరేగిపోయాడు. 

ఈ మ్యాచ్ లో సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యూహాలు పెద్దగా పనిచేయలేదు. యశస్వి  జైస్వాల్ యథేచ్ఛగా హిట్టింగ్ చేయడమే అందుకు నిదర్శనం. జైస్వాల్ అన్నివైపులా షాట్లు కొడుతుండడంతో ఫీల్డర్లను ఎక్కడ మోహరించాలో అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది. 

జైస్వాల్ 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు చేశాడు. జైస్వాల్ క్రీజులో ఉన్నంత సేపు చెన్నై బౌలర్లు బెంబేలెత్తిపోయారు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ 27, కెప్టెన్ సంజు శాంసన్ 17, షిమ్రోన్ హెట్మెయర్ 8 పరుగులు చేశారు. ఐదోస్థానంలో బరిలో ధృవ్ జురెల్ 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో చకచకా 34 పరుగులు చేసి రాజస్థాన్ స్కోరును 200కి చేరువలోకి తీసుకువచ్చాడు. 

దేవదత్ పడిక్కల్ 13 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు నమోదు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 2, మహీశ్ తీక్షణ 1, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు.

More Telugu News