YS Avinash Reddy: అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా

  • వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిపై సీబీఐ విచారణ
  • ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ పిటిషన్
  • నేడు వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు
  • రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు తిరిగి విచారణ కొనసాగింపు
Hearing of Avinash Reddy bail petition adjourned

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అవినాశ్ పిటిషన్ పై నేడు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణ కొనసాగించనుంది. నేడు అవినాశ్, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. 

అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ... అవినాశ్ ను సీబీఐ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని, అవినాశ్ ను లక్ష్యంగా చేసుకునే సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్టుందని వ్యాఖ్యానించారు. దస్తగిరి వాంగ్మూలం, గూగుల్ టేకౌట్ పైనే సీబీఐ ఆధారపడుతోందని వివరించారు. హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్ గా మార్చడం సీబీఐకి తగదని స్పష్టం చేశారు. 

నాడు, అవినాశ్ జమ్మలమడుగు వెళుతుండగా వివేకా అల్లుడి సోదరుడు ఫోన్ చేశాడని, గుండెపోటు అని చెప్పడంలో కుట్ర లేదని పేర్కొన్నారు. అక్కడున్న వారు గుండెపోటు అని చెబితే, అవినాశ్ అదే విషయం చెప్పారని కోర్టుకు తెలిపారు. 

గూగుల్ టేకౌట్ ఫోన్ ఎక్కడుందో చెబుతుంది కానీ, వ్యక్తి లొకేషన్ చెప్పదని అవినాశ్ న్యాయవాది తమ వాదనలు వినిపించారు. గూగుల్ టేకౌట్ డేటాను ఏ కోర్టు కూడా సాక్ష్యంగా తీసుకోదని అన్నారు. హత్యకు ముందు సునీల్ ఇంట్లో ఉన్నట్టు గూగుల్ టేకౌట్ చెబుతోందని, కానీ రాత్రి 9.30 గంటల వరకు సునీల్ తనతోనే ఉన్నట్టు దస్తగిరి చెబుతున్నాడని వివరించారు. దస్తగిరి వాంగ్మూలం తప్పా? గూగుల్ డేటా తప్పా? అని ప్రశ్నించారు. 

రాజకీయాల్లో ప్రోత్సహించిన బాబాయ్ ని అవినాశ్ ఎందుకు చంపుతారు? అని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అవినాశ్ ను అరెస్ట్ చేయకుండా కస్టోడియల్ విచారణ జరుపుకోవచ్చని సూచించారు. సుప్రీంకోర్టు గతంలో ఇలాంటి ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. కస్టోడియల్ విచారణకు ఆదేశిస్తే తాము తప్పకుండా పాటిస్తామని అన్నారు. 

ఇక, సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. వివేకా రక్తపు మడుగులో కనిపిస్తుంటే గుండెపోటు అనడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు.

More Telugu News