Bandi Sanjay: బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు

Bandi Sanjay bail petition cancellation judgement
  • షరతులు ఉల్లంఘిస్తున్నారని కోర్టుకు తెలిపిన పోలీసులు
  • బండి సంజయ్ బయట ఉంటే విచారణ ఆలస్యమవుతుందని వాదనలు
  • రాజకీయ కుట్రలో భాగంగానే బెయిల్ రద్దు కోరుతున్నారన్న సంజయ్ లాయర్
  • వాదనల అనంతరం ప్రాసిక్యూషన్ వాదనలతో విభేదించిన హన్మకొండ కోర్టు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ ను హన్మకొండ కోర్టు గురువారం కొట్టి వేసింది. సంజయ్ బెయిల్ ను రద్దు చేయాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం దీనిని కొట్టివేసింది. పదో తరగతి హిందీ పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో పోలీసులు బండి సంజయ్ పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే షరతులు ఉల్లంఘిస్తున్నారని, విచారణకు సహకరించడం లేదని చెబుతూ పోలీసులు ఆయన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ కోర్టుకు వెళ్లగా, చుక్కెదురైంది.

బండి సంజయ్ బయట ఉండటం వల్ల విచారణ ఆలస్యమవుతుందని పోలీసులు కోర్టులో వాదనలు వినిపించారు. అయితే బీజేపీ లీగల్ సెల్ ఈ వాదనలను తిప్పికొట్టింది. బండి సంజయ్ కి ఇచ్చిన స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారని, రాజకీయ కుట్రలో భాగంగానే ఆయన బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు కోరుతున్నారని న్యాయస్థానానికి తెలిపింది. ఇరువైపుల వాదనల అనంతరం ప్రాసిక్యూషన్ వాదనలతో మెజిస్ట్రేట్ విభేదించి, బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టివేశారు.

బండి బెయిల్ రద్దు పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసిందని సంజయ్ తరఫు న్యాయవాదులు తెలిపారు. పోలీసులు వినిపించిన వాదనలో పస లేదన్నారు. అలాగే బండి సంజయ్ బెయిల్ షరతులను ఉల్లంఘించలేదన్నారు. అలాగే, సెల్ ఫోన్ పోయిందని తాము ఫిర్యాదు చేశామని వెల్లడించారు.
Bandi Sanjay
Police

More Telugu News