KCR: ఈసారి 100 సీట్లు ఖాయం: సీఎం కేసీఆర్

  • తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ప్లీనరీ
  • సర్వసభ్య సమావేశానికి హాజరైన సీఎం కేసీఆర్
  • షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని వెల్లడి
  • సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచన
CM KCR held BRS party general body meeting

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వేడుకల సందర్భంగా పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. తద్వారా, ముందస్తుపై ఎలాంటి ఆలోచన లేదని తేల్చిచెప్పారు. 

అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలని స్పష్టం చేశారు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకే నష్టం అని కర్తవ్య బోధ చేశారు. సరిగా పనిచేయని ఎమ్యెల్యేలను ఉపేక్షిస్తానని అనుకోవద్దని హెచ్చరిక చేశారు. మళ్లీ అధికారంలోకి రావడం ప్రాధాన్యతా అంశం కాదని, మునుపటి కంటే ఎక్కువ సీట్లు రావడమే ముఖ్యమని కేసీఆర్ పేర్కొన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు సాధించుకున్నామని, ఈసారి 100 సీట్లు వస్తాయన్న ధీమా ఉందని పేర్కొన్నారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో ప్రజాప్రతినిధులు గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకం అవ్వడంపై దృష్టి పెట్టాలని కేసీఆర్ నిర్దేశించారు. 

రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతో తెలంగాణ సాధించుకున్నామని, పార్లమెంటరీ విధానంతో దేశంలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో నిరూపించామని పేర్కొన్నారు. తెలివి ఉంటే బండ మీద ఈకలు కూడా మొలిపించవచ్చని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

More Telugu News