Somesh Kumar: సోమేశ్ కుమార్ వీఆర్ఎస్ కు ఆమోదం.. త్వరలోనే బీఆర్ఎస్ లోకి?

  • సోమేశ్ దరఖాస్తుకు ఓకే చెప్పిన డీవోపీటీ
  • ఇటీవల ఔరంగాబాద్ బీఆర్ఎస్ సభలో ప్రత్యక్షమైన మాజీ సీఎస్
  • గులాబీ పార్టీలో చేరుతారంటూ ఊహాగానాలు
  • ప్రభుత్వ సలహాదారు పదవి పొందే అవకాశం ఉందని ప్రచారం
EX CS Somesh Kumar VRS Approved by DOPT

తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు డీవోపీటీ (కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ) అనుమతినిచ్చింది. ఆయన చేసుకున్న దరఖాస్తుకు ఈ మేరకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీంతో సోమేశ్ త్వరలోనే బీఆర్ఎస్ లో చేరబోతున్నారని, లేదా ప్రభుత్వ సలహాదారు పదవి పొందే అవకాశం ఉందని అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. 

బిహార్‌కు చెందిన సోమేశ్ కుమార్.. 1989 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ఏపీ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు కేటాయించినా.. సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఉత్తర్వుల మేరకు తెలంగాణలోనే ఆయన కొనసాగారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పని చేశారు.

అయితే క్యాట్‌ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టులో డీవోపీటీ సవాల్‌ చేయగా.. హైకోర్టు ఆయన్ను తక్షణం ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. మరో అవకాశం లేకపోవడంతో ఆయన ఏపీ జీఏడీలో రిపోర్టు చేశారు. ఏపీ ప్రభుత్వం ఆయనకు ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వలేదు.

ఈ నేపథ్యంలో ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కూడా ఆమోదముద్ర వేశారు. సోమేశ్ దరఖాస్తుకు తాజాగా డీవోపీటీ అంగీకరించింది. దీంతో సోమేశ్ కుమార్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం మొదలైంది.

మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఔరంగాబాద్ లో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో సోమేశ్ ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశమైంది. వేదికపై ఉన్న ఆయన గురించి కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో సోమేశ్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమేననే చర్చ జరుగుతోంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సోమేశ్ ను నియమిస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

More Telugu News