councillor: టీచర్ జాబ్ కోసం కౌన్సిలర్ పదవికి రాజీనామా!

  • 1998లోనే డీఎస్సీ రాసి సెలక్ట్ అయినా అపాయింట్ మెంట్ అందలేదు 
  • తాజాగా డీఈవో నుంచి నియామకపు ఉత్తర్వులు అందుకున్న కౌన్సిలర్
  • వెంటనే తన పదవికి రాజీనామా చేసి టీచర్ జాబ్ లో చేరిన మదనపల్లి మాజీ కౌన్సిలర్ గీతాశ్రీ
Madanaplle Municipal Councillor Resignation for Teacher Job

రాజకీయాల్లోకి రావడానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన వారు కోకొల్లలుగా ఉంటారు.. కానీ టీచర్ జాబ్ కోసం ఓ మహిళ తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటుచేసుకుందీ ఘటన.

మదనపల్లి మున్సిపాలిటీ 8 వ వార్డుకు గీతాశ్రీ కౌన్సిలర్.. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారావిడ. టీచర్ జాబ్ అంటే ఇష్టంతో 1998లోనే ఆమె డీఎస్సీ రాశారు. సెలెక్ట్ అయినప్పటికీ గీతాశ్రీకి అపాయింట్ మెంట్ లెటర్ రాలేదు. తాజాగా ఈ నెల 13న గీతాశ్రీని టీచర్‌గా నియమిస్తూ చిత్తూరు జిల్లా విద్యాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు అధికారిక లేఖ అందుకున్న వెంటనే ఆమె తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు.

తనపై నమ్మకంతో కౌన్సిలర్ గా గెలిపించినా.. న్యాయం చేయలేకపోతున్నానని, తనను క్షమించాలని గీతాశ్రీ తన వార్డు ప్రజలను కోరారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నప్పటికీ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రస్తుతం స్కూల్ టీచర్ గా పిల్లలకు పాఠాలు చెప్పడంలో బిజీగా ఉన్నట్లు గీతాశ్రీ తెలిపారు.

More Telugu News