safari ride: సఫారీ రైడ్ కు వెళితే వెంటపడ్డ పులి.. వీడియో ఇదిగో!

  • ఒక్కసారిగా గాండ్రిస్తూ పరుగెత్తుకొచ్చిన వ్యాఘ్రం 
  • భయంతో కేకలు వేసిన పర్యాటకులు
  • చాకచక్యంగా జీప్ ను ముందుకు తీసుకెళ్లిన డ్రైవర్
  • వీడియో తీసి ట్విట్టర్ లో పెట్టిన ఓ పర్యాటకుడు
Angry Tiger Threatens Tourists Who Went On A Safari Ride

సరదాగా జంతువులను దగ్గరి నుంచి చూడాలని సఫారీ రైడ్ కు వెళ్లిన పర్యాటకులకు పై ప్రాణాలు పైనే పోయినంత పనయ్యింది. ఒక్కసారిగా పులి వెంటపడడంతో వణికిపోయారు. భయంతో కేకలు వేశారు. ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో సఫారీ రైడ్ కు వెళ్లిన పర్యాటక బృందానికి ఈ అనుభవం ఎదురైంది. అదే గ్రూపులో ఉన్న ఓ పర్యాటకుడు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.

పార్క్ లో సఫారీ రైడ్ కు వెళ్లిన పర్యాటక బృందానికి ఓ చోట పొదల్లో పెద్ద పులి కనిపించింది. దీంతో సఫారీ జీప్ డ్రైవర్ కాసేపు వాహనాన్ని నిలిపేశాడు. టూరిస్టులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఇదంతా చూసి పులికి మండిపోయినట్టుంది.. ఒక్కసారిగా గాండ్రిస్తూ జీప్ వైపు పరిగెత్తుకొచ్చింది. అప్పటిదాకా పులిని చూస్తూ ఎంజాయ్ చేసిన పర్యాటకులకు పులి గాండ్రింపుతో గుండెలు జలదరించాయి. భయంతో కేకలు వేయడం మొదలుపెట్టారు. అప్రమత్తమైన డ్రైవర్.. చాకచక్యంగా అక్కడి నుంచి జీప్ ను నెమ్మదిగా కదిలించాడు. జీప్ వెళ్లిపోతుండడం చూసి పులి కూడా నెమ్మదించి వెనుదిరిగింది.

ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ ‘వేళాపాళా లేకుండా అదేదో వాళ్ల హక్కులాగా జనం మీ ఇంట్లోకి వస్తూపోతుంటే మీరేం చేస్తారు?’ అంటూ కామెంట్ చేశారు. పర్యాటకుల గోలతో ఆ పులికి విసిగిపోయినట్లుందని ఆయన వ్యాఖ్యానించారు.

More Telugu News