save money: పొదుపు పెంచుకోవడం ఎలా..?

  • అనవసర ఖర్చులకు కళ్లెం వేసినప్పుడే పొదుపు సాధ్యం
  • ప్రతీ కుటుంబానికీ ఆర్థిక ప్రణాళిక అవసరం
  • ప్రణాళిక మేరకు, క్రమశిక్షణగా నడుచుకుంటే మిగులు
easy ways to cut your expenses and save money

ఎంత సంపాదించామన్నది కాదు.. ఎంత పొదుపు చేశామన్నదే ఆర్థిక శాస్త్రంలో ముఖ్యమైన సూత్రం. రూ.లక్ష సంపాదించిన వ్యక్తి నెలకు రూ.10 వేలు ఆదా చేయడం కంటే.. రూ.30 వేలు సంపాదించిన వ్యక్తి నెలకు రూ.12 వేలు పొదుపు చేయగలిగితే అదే గొప్ప. సంపదను పెంచుకోవాలంటే ఇలాంటి సూత్రాలను అనుసరించాల్సిందే. ముఖ్యంగా పొదుపు పెంచుకోవాలంటే అందుకు ముఖ్యమైన మార్గం ఖర్చులను తగ్గించుకోవడమే. ఖర్చులకు కళ్లెం వేయగలిగిన వారే ఆర్థిక విజేతలు అవుతారని ఎన్నో నిదర్శనాలు చెబుతున్నాయి. 

మరి ఖర్చులను తగ్గించుకోవాలంటే అవసరాలు, కోరికల మధ్య తేడాను గుర్తించాలి. ఆఫీస్ కు వెళ్లి రావడానికి ఓ వాహనం కావాలి. ద్విచక్ర వాహనం అయితే సరిపోతుంది. అందులోనూ రూ.80 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు వేర్వేరు ధరలకు మోడళ్లు అందుబాటులో ఉంటాయి. రూ.80 వేలకు బదులు రూ.1.5 లక్ష వాహనం ఎంపిక చేసుకోవడం వల్ల రూ.70వేలు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. పైగా నెలవారీ నిర్వహణ ఖర్చు కూడా రూ.80వేల వాహనంతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఈ వైరుధ్యాన్ని గుర్తించాలి.

బడ్జెట్
ప్రతి ఒక్కరూ తమ నెలవారీ ఖర్చులు, పొదుపు, పెట్టుబడుల వివరాలతో ఒక ప్రణాళిక వేసుకోవాలి. ప్రణాళిక లేకుండా వచ్చిన ఆదాయాన్ని ఖర్చు పెడుతున్నట్టు అయితే.. గమ్యం తెలియకుండా ప్రయాణం చేస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. మొత్తం ఆదాయం నుంచి ఖర్చులన్నింటినీ తీసివేయగా ఎంతో కొంత మిగులు ఉండాల్సిందే. లేదంటే మిగులు కోసం ఏవైనా ఖర్చులకు కోత పెట్టుకోవాల్సిందే.

అనవసర ఖర్చులు
పైన వాహనానికి సంబంధించి చెప్పుకున్న ఉదాహరణ మాదిరిగా అనవసర ఖర్చులు ఎన్నో చేస్తుంటాం. నిత్యావసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. మిగులు లేనప్పుడు రెస్టారెంట్ లో తినాల్సిన అవసరం కూడా లేదు. మూవీ కోసం థియేటర్ కు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఓటీటీలో చూసేయవచ్చు. పది కిరాణా వస్తువుల కోసం అని చెప్పి షాపింగ్ మాల్ కు వెళ్లి 20 వస్తువులు పట్టుకురావడం అనవసర ఖర్చు కిందకే వస్తుంది. ఇలాంటి వాటికి కళ్లెం వేయాలి.

షాపింగ్ చేయాలనుకున్నప్పుడు నేడు ఎన్నో యాప్స్ కూడా వచ్చాయి. ధరలను రెండు మూడింట మధ్య పోల్చి చూసుకుని తక్కువగా ఉన్న చోట కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం అవుతుంది. పెరుగుతున్న ఆదాయానికి అనుగుణంగా ఖర్చులు పెంచుకోవద్దు. ఇంటి అద్దె పెరిగిందనుకుంటే తక్కువ అద్దె ఇంటికి వెళ్లడమే మంచిది. రూ.లక్షలు పెట్టి కారును కొనుగోలు చేసి, ఖర్చు తగ్గించుకునేందుకు ఇంట్లో పార్క్ చేయడం వల్ల వచ్చేదేమీ ఉండదు. దీనికి బదులు కావాల్సినప్పుడు క్యాబ్ బుక్ చేసుకోవడమే మంచిది. కారు కొనుగోలుకు వెచ్చించే మొత్తాన్ని మంచి రాబడి వచ్చే సాధనంలో పెట్టుకోవాలి. 

పెట్టుబడులు
సంపాదన నుంచి కనీసం నెలవారీగా 30 శాతమైనా పొదుపు చేయాలి. ఈ పొదుపు ఈక్విటీ, డెట్ లో పెట్టుబడులుగా వెళ్లాలి. చిన్న వయసులో వారు అయితే 80 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. ఇతరులు 50 వాతం వరకు ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు.

ముఖ్యమైనవి
అత్యవసర నిధి ప్రతి ఒక్కరికీ ఉండాలి. ఉద్యోగం కోల్పోయినా, ఉన్నట్టుండి వైద్యం అవసరమైనా ఇది ఆదుకుంటుంది. దీనికితోడు సంపాదించే ప్రతి ఒక్కరూ తమ వార్షిక ఆదాయానికి పది రెట్ల మేర టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కనీసం రూ.5-10 లక్షల కవరేజీతో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.

More Telugu News