India: అంబానీనా మజాకా..! తన కుడి భుజం లాంటి ఉద్యోగికి రూ.1500 కోట్ల భవంతి బహుమతి

  • చాలా ఏళ్ల నుంచి ముఖేష్ అంబానీ వద్ద పని చేస్తున్న మనోజ్ మోదీ
  • రిలయన్స్ రిటైల్, జియోలో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న మోదీ
  • అత్యంత ఖరీదైన ప్రాంతంలో 22 అంతస్తుల భవంతిని ఇచ్చిన అంబానీ
Mukesh Ambani Gifts rs1500 Crore Property to his Right hand

మన దేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో తనకు కుడి భుజం లాంటి ఓ ఉద్యోగికి రూ.1,500 కోట్ల విలువైన భారీ భవంతిని బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచారు. అంబానీ సంస్థల్లో చాలా ఏళ్ల నుంచి పని చేస్తూ ఇంత ఖరీదైన బహుమతిని అందుకున్న ఆ ఉద్యోగి పేరు మనోజ్ మోదీ. వ్యాపార వర్గాల్లో అంబానీకి కుడి భుజంగా ఆయనకు పేరుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ పలు -బిలియన్ డాలర్ల ఒప్పందాలు చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. 
 
ఈ క్రమంలో మనోజ్ మోదీకి అత్యంత ఖరీదైన, విలువైన ప్రాంతంలో 22 అంతస్తుల భవనాన్ని ముఖేష్ బహుమతిగా ఇచ్చారు.  ఈ భారీ భవంతి పేరు ‘బృందావన్’. ఇది దక్షిణ ముంబైలోని అత్యంత ఖరీదైన నేపియన్ సీ రోడ్ మలబార్ హిల్‌కు ఆనుకుని ఉంది. చుట్టూ పచ్చని పరిసరాలు, అత్యున్నత స్థాయి సౌకర్యాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం మూడు వైపులా సముద్రం ఉండటం మరో ప్రత్యేకత.

ఈ భవనం 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఒక్కో అంతస్తు 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఏడు అంతస్తులను పార్కింగ్ కు కేటాయించారు. ఈ ప్రాంతంలోని ఫ్లాట్స్ చదరపు అడుగు రూ45,100 నుంచి రూ.70,600 పలుకుతున్నాయి. ఈ లెక్కన బృందావన్ ఖరీదు రూ. 1,500 కోట్లు పైనే ఉంటుంది. 

కాగా, మనోజ్ మోదీ ప్రస్తుతం రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. హజీరా పెట్రోకెమికల్ కాంప్లెక్స్, జామ్‌నగర్ రిఫైనరీ, రిలయన్స్ రిటైల్, 4జీ రోల్‌అవుట్ వంటి రిలయన్స్ భారీ ప్రాజెక్ట్‌లు కూడా మనోజ్ మోదీ పేరిట ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News