YS Avinash Reddy: సీబీఐకి సునీత ఇచ్చిన వాంగ్మూలంపై అనుమానాలు ఉన్నాయి: అవినాశ్ రెడ్డి

  • సునీత వాంగ్మూలంపై అనుమానాలు ఉన్నాయన్న అవినాశ్
  • సీబీఐ ఒక్క కోణంలోనే దర్యాప్తు చేస్తోందని విమర్శలు
  • తనను కుట్ర పూరితంగా ఇరికిస్తున్నారని ఆరోపణ
  • తనకే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటన్న కడప ఎంపీ
Avinash Reddy talks to media

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. సునీత సీబీఐకి మొదట ఇచ్చిన వాంగ్మూలం తేడాతో ఉందని అవినాశ్ రెడ్డి అన్నారు. ఆమె వాంగ్మూలంపై తమకు అనుమానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. సీబీఐ ఒక్క కోణంలోనే దర్యాప్తు చేస్తోందని విమర్శించారు. 

సీబీఐ తనను ఈ కేసులో కుట్రపూరితంగా ఇరికిస్తోందని అవినాశ్ ఆరోపించారు. వివేకా హత్య కేసు ఛేదన కంటే తనను ఇరికించేందుకే సీబీఐ ఎక్కువగా ప్రయత్నిస్తోందని వివరించారు. ఈ వ్యవహారాన్ని రెండేళ్లుగా నేను సీరియస్ గా తీసుకోనందునే ఇలా జరిగిందని పేర్కొన్నారు. ఒక ఎంపీకే ఇన్ని ఇబ్బందులు వస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటి? అని అవినాశ్ వాపోయారు. 

"వివేకా హత్య రోజున నేను జమ్మలమడుగు వెళుతున్నాను. పులివెందుల రింగ్ రోడ్డు వరకు వెళ్లాక శివప్రకాశ్ రెడ్డి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయితే, ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్నట్టు చూపించి కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. నాతో పాటు ఆ రోజు జమ్మలమడుగుకు 20 మంది పైనే వస్తున్నారు. నా వెనుక వచ్చిన వారిని ప్రశ్నించినా విషయం తెలుస్తుంది. 

హత్య రోజున విలువైన పత్రాలు ఎత్తుకెళ్లామని దస్తగిరి చెప్పాడు. కానీ చోరీ కేసు సెక్షన్లు పెట్టలేదు... ఆ కోణంలో విచారించడంలేదు. లేఖ, సెల్ ఫోన్ సాయంత్రం వరకు ఎందుకు దాచిపెట్టారు? ఆ కోణంలో వారిని ఎందుకు ప్రశ్నించడంలేదు? ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయడంలేదు? వివేకా కేసులో నిజాలు బయటికి రావాలని కోరుకుంటున్నా. నేను ఏ తప్పు చేయలేదని చాలా నమ్మకంగా ఉన్నాను" అని అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు.

More Telugu News