YS Avinash Reddy: అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా

MP Avinash Reddy anticipatory bail petition postponed to tomorrow
  • ఉదయం హియరింగ్ కు అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్
  • సుప్రీం ఆర్డర్ కాపీ లేకపోవడంతో మధ్యాహ్నానికి వాయిదా వేసిన కోర్టు
  • రేపు వాదనలు వింటామన్న తెలంగాణ హైకోర్టు
కడప ఎంపీ, వైసీపీ నేత అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం వాదనలు వింటామని న్యాయమూర్తి చెప్పారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాఫ్తు సంస్థ సీబీఐ... అవినాశ్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఆయన తండ్రి వైఎస్ భాస్కర రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడంతో తనను కూడా అరెస్ట్ చేస్తారేమోననే ఆందోళనతో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఆరు రోజుల క్రితం ముందస్తు బెయిల్ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు... ఇరువైపుల వాదనలు వినడంతో పాటు, ఈ నెల 25న విచారణ, తీర్పు చెబుతామని తెలిపి, అప్పటి వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఈ కేసు హియరింగ్ కు వచ్చింది. ఇవాళ త్వరగా విచారణ జరపాలని అవినాశ్ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. అయితే సుప్రీం కోర్టు సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతి ఇంకా అందలేదని ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపారు. సుప్రీం కోర్టు డాక్యుమెంట్స్ లేకుండా విచారణ కొనసాగించలేమని, సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా విచారణ ఉంటుందని జడ్జి తెలిపారు. అయితే మధ్యాహ్నం సుప్రీం ఉత్తర్వులు సమర్పిస్తామని అవినాశ్ తరఫు లాయర్ తెలిపారు.

దీంతో ఉదయం వచ్చిన హియరింగ్ ఆర్డర్ కాపీ లేకపోవడంతో మధ్యాహ్నానికి వాయిదా పడింది. మధ్యాహ్నం గం.2.30కు విచారణ జరుపుతామని న్యాయమూర్తి తెలిపారు. వాదనలు వినే క్రమంలో ఈ పిటిషన్ ను రేపు విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు. ప్రధానంగా ఆర్డర్ కాపీ ఆలస్యం కావడంతో విచారణ రేపటికి వాయిదా పడింది. అయితే హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.  
YS Avinash Reddy
CBI
YS Vivekananda Reddy

More Telugu News