Sensex: బంగారం-సెన్సెక్స్.. లక్ష మార్క్ ను ఏది ముందుగా చేరుతుంది?

  • బంగారంతో పోలిస్తే సెన్సెక్స్ ముందుగా చేరుకోవచ్చన్న అంచనా
  • సెన్సెక్స్ కు అధిక రాబడుల సామర్థ్యాలను ప్రస్తావిస్తున్న అనలిస్టులు
  • అయినా బంగారంలోనూ 7-8 శాతం మేర రాబడుల అవకాశాలు
Sensex vs gold Which will hit the 1 lakh mark first

కొందరికి బంగారంలో పెట్టుబడులు పెట్టడం అంటే ఇష్టం. కొందరికి ఈక్విటీలంటే ఎంతో ఇష్టం. రెండూ పెట్టుబడి సాధనాలే. ఈక్విటీల్లో అస్థిరతలు ఎక్కువ. బంగారంలో కాస్త తక్కువ. ఈక్విటీల్లో దీర్ఘకాలంలో రాబడులు ఎక్కువ. బంగారంలోనూ రాబడులు వస్తాయి. కాకపోతే ఈక్విటీలతో పోలిస్తే తక్కువ. ఈ రెండింటికీ పెట్టుబడి సాధనాలుగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.62,000 స్థాయిలో ఉంది. ప్రస్తుతం సెన్సెక్స్ 60,100 పాయింట్ల స్థాయిలో ఉంది. మరి ఈ రెండింటిలో లక్ష మార్క్ ను ఏది ముందుగా చేరుకుంటుంది? ఇది ఆసక్తికరమైన ప్రశ్న. 

బంగారం గడిచిన ఏడాది కాలంలో 15 శాతం ప్రతిఫలాన్నిచ్చింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు, సంక్షోభాలు, ద్రవ్యోల్బణం పెరిగిపోయిన సందర్భాల్లో బంగారం ధరలు పెరగడం సహజం. కానీ, గడిచిన ఏడాది కాలంలో సెన్సెక్స్ రాబడి బంగారం కంటే తక్కువగానే ఉంది. అంతెందుకు 2008 నుంచి చూసినా, ఈక్విటీలతో పోలిస్తే బంగారమే ఒక శాతం వరకు అదనపు రాబడినిచ్చిందంటే నమ్మశక్యం కాదు. కాకపోతే చారిత్రకంగా చూస్తే ఈక్వీటీల్లోనే అధిక రాబడులున్నాయి.

‘‘అన్ని ప్రముఖ కేంద్ర బ్యాంకులు దూకుడుగా ద్రవ్యపరపతి విధానాలు చేపట్టడంతో అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం చోటు చేసుకుంది. ఇది బంగారానికి మద్దతుగా నిలుస్తుంది. దీనికితోడు అన్ని కేంద్ర బ్యాంకులు సురక్షిత సాధనమైన బంగారం కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం ధరలకు మద్దతునిచ్చింది’’ అని స్టాక్ బాక్స్ రీసెర్చ్ హెడ్ మనీష్ చౌదరి తెలిపారు. బంగారం కంటే ముందుగా సెన్సెక్స్ లక్ష పాయింట్ల మార్క్ ను అధిగమిస్తుందని ఆనంద్ రాతీ రీసెర్చ్ హెడ్ నరేంద్ర సోలంకి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంత కాలం లోపు లక్ష మార్క్ కు చేరుకుంటున్నది దేశ ఆర్థిక పనితీరు నిర్ణయిస్తుందన్నారు. 

‘‘బంగారం ఎప్పుడూ 7-8 శాతం మేర దీర్ఘకాలంలో రాబడులను ఇస్తుంది. సెన్సెక్స్ 12-15 శాతం మేర వార్షిక రాబడులను అందించగలదు. భారత్ వృద్ధి సామర్థ్యాలను గమనిస్తే బంగారం కంటే సెన్సెక్స్ ముందుగా కొత్త గరిష్ఠాలకు చేరుకుంటుందని భావించొచ్చు’’ అని టర్టిల్ వెల్త్ పీఎంఎస్ కు చెందిన రోహన్ మెహతా పేర్కొన్నారు.

More Telugu News