Mamata Banerjee: ఆ విషయంలో నాకు ఎలాంటి అహం లేదు: బెంగాల్​ సీఎం మమత

Mamata Banerjee Asks Nitish Kumar For Opposition Meet In Bihar
  • బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల మహా కూటమి ఏర్పాటు కావాలన్నటీఎంసీ అధినేత్రి
  • బీహార్ సీఎం నితీష్, డిప్యూటీ సీఎం తేజస్వితో కోల్ కతాలో భేటీ అయిన మమత
  • బీహార్ లో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నితీష్ కు సూచన
బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలతో కలిసి మహా కూటమి ఏర్పాటు విషయంలో తనకు ఎలాంటి అహం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ప్రజలు వర్సెస్ బీజేపీగా ఉంటాయన్నారు. ఈ రోజు కోల్ కతాకు వచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌తో మమత సమావేశం అయ్యారు. ఈ ఎన్నికల సమరానికి భావసారూప్యత గల ప్రతిపక్షాలన్నీ కలిసి రావడానికి తనకు అభ్యంతరం లేదని పునరుద్ఘాటించారు.

‘నేను నితీష్ కుమార్‌కి ఒకే ఒక అభ్యర్థన చేశాను. జయప్రకాష్ నారాయణ ఉద్యమం బీహార్ నుంచే ప్రారంభమైంది. మనం బీహార్‌లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే, మనం తదుపరి ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోవచ్చు. అయితే ముందుగా మనమంతా ఐక్యంగా ఉన్నామనే సందేశం ఇవ్వాలి. ఈ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని నేను ముందే చెప్పాను. బీజేపీ జీరో అయిపోవాలని కోరుకుంటున్నాను. మీడియా మద్దతు, అబద్ధాలతో బీజేపీ పెద్ద హీరో అయ్యింది’ అని మమత పేర్కొన్నారు. 

కాగా, తమ మధ్య చాలా సానుకూల చర్చ జరిగిందన్న నితీష్ కుమార్ రాబోయే ఎన్నికలకు ముందు అన్ని సన్నాహాలు చేయడం గురించి చర్చించినట్లు చెప్పారు. ప్రస్తుత పాలకులు సొంత ప్రచారం తప్పితే దేశాభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు తెల్లవారుజామున కోల్‌కతా చేరుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెసేతర మహాకూటమి ఏర్పాటు విషయమై మమతను కలిశారు. అనంతరం సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను కలవడానికి నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ కలిసి లక్నోకు వెళ్లనున్నారు.  
Mamata Banerjee
Nitish Kumar
West Bengal
BJP
apposite parties

More Telugu News