Sharad Pawar: అలా చేయడం వారి వ్యూహం కావొచ్చు: అజిత్ పవార్ అంశం‌పై శరద్ పవార్

  • అజిత్ పవార్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలపై స్పందించిన ఎన్సీపీ చీఫ్
  • పార్టీ నుండి విడిపోయి వేరే పార్టీలో కలవడంపై చర్చ జరగలేదని వ్యాఖ్య
  • పార్టీలు కలిసి పోటీ చేయడం పైన కూడా స్పందించిన శరద్ పవార్
If someone is trying NCPs Sharad Pawar after Ajit Pawar says ready for CM post

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాల పైన ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పందించారు. ఎన్సీపీ నుండి విడిపోయి వేరే పార్టీలో కలవడం అనే వార్తల పైన ఇంత వరకు పార్టీలో చర్చ జరగలేదని, అయినప్పటికీ ఎవరైనా పార్టీ నుండి విడిపోవాలని ప్రయత్నిస్తున్నట్లయితే అది వారి వ్యూహం అయి ఉండవచ్చునని చెప్పారు. ఒకవేళ అలా జరిగితే దీనిపై గట్టిగానే నిలబడతామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదని, కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం అవసరం లేదన్నారు.

ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆశ పడటం తప్పేమీ కాదని ఇటీవల అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల వరకు ఎందుకు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవిని పొందేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహా వికాస్ అఘాడి కూటమిలో చర్చనీయాంశంగా మారాయి.

కూటమి పోటీపై పవార్

వచ్చే ఎన్నికల్లో మహా వికాస్ అఘాడిలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ముందుకు సాగుతాయా అని మీడియా ప్రశ్నించగా పవార్ స్పందించారు. కలిసి ఉండాలనే ఆలోచన మాత్రమే సరిపోదన్నారు. సీట్ల కేటాయింపు, ఏవైనా సమస్యలు ఉన్నాయా లేదా ఇవన్నీ ఇంకా చర్చించాల్సి ఉందని చెప్పారు. కాబట్టి అప్పుడే చెప్పలేమన్నారు. పవార్ వ్యాఖ్యలపై ఉద్దవ్ థాకరే వర్గం శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. తమ పార్టీలతో కూడిన కూటమి చెక్కు చెదరలేదని స్పష్టం చేశారు.

More Telugu News