Silver: ఇప్పుడిక వెండి వంతు.. 20 శాతం పెరగొచ్చంటున్న విశ్లేషకులు

  • దేశీయంగా వెండి వినియోగానికి పెరిగిన డిమాండ్
  • బంగారం ధరల ర్యాలీతో వెండికీ మద్దతు
  • కిలో వెండి ధర రూ.90 వేలకు చేరుకోవచ్చన్న అంచనాలు
Silver the new gold for your portfolio can hit Rs 90000 soon

బంగారం ధరలు ఇటీవలి కాలంలో ర్యాలీ చేశాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62 వేలకు చేరుకుంది. బంగారమే కాదు, వెండి కూడా ఈ ఏడాది ఇప్పటి వరకు 11 శాతం మేర లాభపడింది. వెండి కిలో ధర రూ.76 వేలకు చేరుకోగా.. ఇది ఇక్కడి నుంచి మరో 20 శాతం మేర లాభపడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బంగారంలో ఇటీవలి కాలంలో ర్యాలీ నేపథ్యంలో, కాస్త చౌకగా లభిస్తున్న వెండికి సైతం డిమాండ్ ను ఇచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధరలు ఇక్కడి నుంచి దీర్ఘకాలం పాటు నిలకడగా కొనసాగుతాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. బంగారాన్ని ఆభరణాలు, పెట్టుబడుల కోణంలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. వెండిని మాత్రం పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వెండిలో ఇన్వెస్ట్ చేసే వారూ ఉన్నారు. వెండి వచ్చే 9-12 నెలల కాలంలో కిలోకి రూ.85,000-90,000కు చేరుకోవచ్చన్న అంచనా వ్యక్తమవుతోంది. బంగారం-వెండి రేషియో ప్రస్తుతం 80గా ఉంది. కానీ చారిత్రకంగా చూస్తే ఈ రేషియో 65-75 మధ్యే ఎక్కువగా ఉంటోంది. కనుక ఈ రేషియో ఎప్పటి మాదిరే సర్దుకోవాలంటే అటు బంగారం ధరలు అయినా దిగి రావాలి. లేదంటే వెండి ధరలు అయినా పెరగాల్సి ఉంటుంది. 

‘‘గోల్డ్-సిల్వర్ రేషియో ప్రకారం చూస్తే వెండి ధరల ర్యాలీ ఇక ముందూ కొనసాగుతుంది. వెండి ధరలు నిరోధ స్థాయి అయిన రూ.72,000ను అధిగమించాయి. ఇప్పుడు ఎంసీఎక్స్ లో రూ.85,000-86,000 దిశగా కదలొచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ హెడ్ రవీంద్రరావు తెలిపారు.

ప్రపంచంలోనే వెండికి అతిపెద్ద వినియోగ దేశంగా భారత్ ఉంది. మన దేశ వెండి అవసరాల్లో 90 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. 2022లో 9,500 టన్నుల వెండి డిమాండ్ నెలకొంది. మన దేశంలో వెండిని ఉత్పత్తి చేసే ఏకైక సంస్థ హిందుస్థాన్ జింక్ సీఈవో అరుణ్ మిశ్రా సైతం ధరల ర్యాలీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. 

5జీ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, రెన్యువబుల్ ఎనర్జీకి మనదేశంలో డిమాండ్ నెలకొనడంతో వెండికి సైతం డిమాండ్ బలంగా నెలకొన్నట్టు మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవనీత్ దమానీ తెలిపారు.

More Telugu News