Asaduddin Owaisi: ఒవైసీ.. ఒవైసీ.. అని ఇంకెంత కాలం ఏడుస్తారు?: అసదుద్దీన్ ఒవైసీ

  • తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామన్న అమిత్ షా
  • ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారన్న ఒవైసీ
  • ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి మాట్లాడాలని సూచన
Owaisi responce to Amit Shah comments on Scrap Muslim Quota in Telangana

నిన్న హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేవెళ్ల సభలో ప్రసంగిస్తూ బీఆర్ఎస్, ఎంఐఎంలపై విమర్శలు గుప్పించారు. ప్రజల కోసం కేసీఆర్ పాలన సాగించడం లేదని, ఒవైసీ కోసం పాలిస్తున్నారని చెప్పారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని... తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ కోటాను ఎత్తివేస్తామని అన్నారు. ముస్లింకు ఇస్తున్న రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో అమిషా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. 

హైదరాబాద్ కు వచ్చినప్పుడల్లా ఒవైసీ.. ఒవైసీ... అంటూ ఇంకెంత కాలం ఏడుస్తారని అసద్ ప్రశ్నించారు. ఇకనైనా ఇలాంటి వ్యాఖ్యలను ఆపి... ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి మాట్లాడాలని సూచించారు. ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం తప్ప... తెలంగాణపై బీజేపీకి ఎలాంటి ప్రేమ లేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై మీకు నిజంగా ప్రేమ ఉంటే... రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ను తొలగించేందుకు రాజ్యాంగ సవరణను తీసుకురావాలని సవాల్ విసిరారు. బూటకపు ఎన్ కౌంటర్లు చేయడం, నేరస్తులను విడుదల చేయడం వంటివి బీజేపీ ప్రభుత్వమే చేస్తుందని మండిపడ్డారు.

More Telugu News