Hyderabad: అనధికారిక సైరన్లు వినియోగించే వాహనాలు సీజ్ చేస్తాం: హైదరాబాద్​ సీపీ సీవీ ఆనంద్

  • అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు ఆదేశం
  • సైరన్ లు వాడుతూ తోటి వాహనదారులకు ఇబ్బంది కలిగించడంపై ఫిర్యాదుల స్పందన
  • ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ట్రాఫిక్ పోలీసులకు సీపీ సూచన 
Hyderabad CP CV Anand directs  traffic police to conduct a special drive and detain and seize all vehicles using unauthorised sirens

హైదరాబాద్ ట్రాఫిక్ లో ప్రయాణం చేయడం ఒక్కోసారి నరకంగా మారుతోంది. కొందరు ఇష్టానుసారంగా వాహనాలు నడిపి ట్రాఫిక్ జాంలకు కారణం అవుతున్నారు. కొందరు అనుమతి లేకపోయినా సైరన్లను ఉపయోగిస్తున్నారు. అసలే ట్రాఫిక్ లో చిక్కుకొని ఇబ్బంది పడే వాహన దారులకు ఈ సైరన్ల గోల తలనొప్పి తెప్పిస్తున్నాయి.  టోలిచౌకిలో రాత్రి పదిన్నర సమయంలో ఏపీ రిజిస్ట్రేషన్ ఉన్న ఇన్నోవా వాహనం సైరన్ తో హల్ చల్ చేసింది. దీన్ని వీడియో తీసిన ఓ జర్నలిస్టు ట్విట్టర్ లో షేర్ చేశారు. తాను ఆ వాహనాన్ని అడ్డగించి ప్రశ్నించానన్నారు. కానీ, తెలంగాణ హోంమంత్రి భార్య ప్రయాణిస్తున్న కారును ఎలా అడ్డుకుంటారని దబాయించారని చెప్పారు. దీనిపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. చట్టవిరుద్ధంగా సైరన్ లను ఉపయోగించే వారిపై చర్యలు తీసుకోవాలని, వాహనాలను సీజ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. 
 
‘ఇలా చట్టవిరుద్ధంగా సైరన్‌లను ఉపయోగించడం వల్ల చాలా ట్రాఫిక్ సమస్యలు ట్రాఫిక్ నిర్వహణకు అంతరాయం కలుగుతోంది. ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అనధికార సైరన్లు వాడే అన్ని వాహనాలను అదుపులోకి తీసుకుని సీజ్ చేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను కోరాను. అంతేకాదు, రోగులు లేకపోయినా, నకిలీ రోగులను తీసుకెళ్తున్న అంబులెన్సులు కూడా అనవసరంగా సైరన్‌లు వినియోగిస్తున్నట్లు సమాచారం అందితే తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇలా చట్టవిరుద్ధమైన సైరన్‌లను ఉపయోగించే వాహనాలకు సంబంధించిన రుజువులతో తమకు సమాచారం ఇస్తుండాలని ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నానని సీవీ ఆనంద్ ట్వీట్ చేశారు.

More Telugu News