Amritpal Singh: అమృత్ పాల్ ను అస్సాం జైలుకే ఎందుకు తీసుకెళ్లారంటే..?

Amritpal Singh Arrested In Punjab then Sent To Assam Jail why

  • ఉత్తర భారత జైళ్లలో ఉన్న ఖైదీలలో చాలామంది వేర్పాటువాద మద్దతుదారులే
  • సెక్యూరిటీపరంగా దిబ్రూగఢ్ జైలుకు ఉన్న ట్రాక్ రికార్డ్
  • అమృత్ పాల్ మద్దతుదారులు జైలుపై దాడిచేసే అవకాశం ఉండడం
  • ఈ కారణాల వల్లే అమృత్ పాల్ ను రాష్ట్రంలోని జైళ్లలో ఉంచలేదన్న అధికారులు 

ఖలిస్థానీ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను పంజాబ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఆదివారం మోగా జిల్లాలోని ఓ గ్రామంలో అమృత్ పాల్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, పంజాబ్ లో అరెస్టు చేసిన అమృత్ పాల్ ను ఏకంగా రాష్ట్రాలు దాటించి పోలీసులు అస్సాంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు. అంతకుముందు అరెస్టు చేసిన అమృత్ పాల్ అనుచరులను కూడా అదే జైలుకు తరలించారు. పంజాబ్ తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలలోని జైళ్లను కూడా కాదని అస్సాం దాకా తరలించడానికి కారణం ఏంటంటే.. 

పంజాబ్ తో పాటు ఉత్తర భారతదేశంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్లు, ఇతర ఖైదీలు పనిచేసే సంస్థలతో అమృత్ పాల్ కు లేదా ఖలిస్థానీ వేర్పాటువాద ఉద్యమానికి సంబంధం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో చాలామంది ఖైదీలు ఈ వేర్పాటు వాద ఉద్యమ నేతలతో పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని అమృత్ పాల్ మద్దతుదారులు జైలుపై దాడిచేసే అవకాశం ఉందని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో అమృత్ పాల్ ను ఇక్కడి జైళ్లలో ఉంచడం రిస్క్ అని అస్సాంకు తరలించినట్లు సమాచారం.

అస్సాంలోని దిబ్రూగఢ్ జైలుకు అత్యంత పటిష్ఠమైన జైలుగా పేరుంది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ జైలు చరిత్రలో (170 సంవత్సరాలలో) ఒక్క దాడి కానీ, ఖైదీలు తప్పించుకున్న ఘటన కానీ చోటుచేసుకోలేదని అధికారులు చెప్పారు. మిగతా జైళ్లతో పోలిస్తే ఈ జైలు సిటీ మధ్యలోనే ఉంటుంది. సెక్యూరిటీపరంగా చాలా అనుకూలతలు ఉండడంతో అమృత్ పాల్ ను, ఆయన అనుచరులను ఉంచడానికి పంజాబ్ అధికారులు ఈ జైలును ఎంచుకున్నారు. 

ప్రస్తుతం ఈ జైలు చుట్టూ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అస్సాం పోలీసులు, బ్లాక్ క్యాట్ కమెండోలు, సీఆర్ పీఎఫ్ జవాన్లతో సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడంతో పాటు జైలులో కొత్తగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉన్నవాటిలో పాడైన వాటికి మరమ్మతులు చేయించారు. అమృత్ పాల్, ఆయన అనుచరులు ఉంటున్న సెల్ లను నిరంతరం గమనించేలా ఏర్పాట్లు చేసినట్లు దిబ్రూగఢ్ జైలు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News