ఇటలీలో అక్కడ సెల్ఫీ దిగారంటే పాతిక వేలు ఫైన్!
- ఇటలీ, పోర్టోఫినో సిటీలో కొత్త రూల్ తీసుకొచ్చిన మేయర్
- ఉదయం నుంచి సాయంత్రం దాకా నిషేధాజ్ఞలు
- ట్రాఫిక్ జామ్ అవుతుండడమే కారణమని వివరణ
ఇటలీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పోర్టోఫినో సిటీ కూడా ఒకటి.. ఈ సిటీలో ముఖ్యంగా రెండుచోట్ల సెల్ఫీల కోసం పర్యాటకులు ఎగబడుతుంటారు. దీంతో ఆ రెండుచోట్లా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఉదయం ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లే వారు ట్రాఫిక్ లో చిక్కుకుని అవస్థ పడుతున్నారు. ఈ క్రమంలో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకోకూడదని మేయర్ మాటియో వయాకవా ఆదేశాలు జారీ చేశారు.
కాదని సెల్ఫీలు తీసుకున్న వారిపై ఏకంగా 275 యూరోలు జరిమానా విధిస్తామని ప్రకటించారు. ఈ కొత్త రూల్ అమలయ్యాక సిటీలో ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తీరిపోయాయని స్థానికులు చెబుతున్నారు. కాగా, ఇలా సెల్ఫీలపై నిషేధం విధించిన సిటీ పోర్టోఫినో ఒక్కటే కాదు.. అమెరికా, ఫ్రాన్స్, యూకేలలోని కొన్ని నగరాలలో కూడా ఇదే విధమైన ఆంక్షలు అమలవుతున్నాయి.