Bandi Sanjay: పదవి పోతుందని, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదనే రేవంత్ ఏడ్చాడు: బండి సంజయ్

Bandi Sanjay says why Revanth Reddy weeps at bhagyalaxmi temple
  • ప్రతి ఒక్కరు భాగ్యలక్ష్మి దేవాలయానికి రావాలన్న కోరిక నెరవేరిందన్న బండి
  • కేసీఆర్ డబ్బులు రేవంత్‌కు ఇచ్చారనలేదు, కాంగ్రెస్‌కు ఇచ్చినట్లు చెప్పారని వ్యాఖ్య
  • ఖర్గే, జానారెడ్డి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ కలుస్తాయంటున్నారన్న బీజేపీ చీఫ్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. నిన్న సాయంత్రం భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద ప్రమాణం అనంతరం ఆయన ఏడ్వడంపై బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. 

ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇక తనకు ఉండదనే రేవంత్ ఏడ్చాడని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిస్తే తన ప్రెసిడెంట్ పదవి పోతుందనే కన్నీరు కార్చారన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో రేవంత్ సతమతమవుతున్నారన్నారు.

బీజేపీ నేతలు ఇవాళ సంఘ సంస్కర్త మహాత్మ బసవేశ్వర జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పైన ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 
బండి సంజయ్ మాట్లాడారు. ప్రతి ఒక్కరు భాగ్యలక్ష్మి దేవాలయానికి రావాలన్న తన కోరిక నెరవేరిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో రూ.25 కోట్లను రేవంత్ కు ఇచ్చినట్లు తమ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎక్కడా చెప్పలేదని గుర్తుంచుకోవాలన్నారు.

కేసీఆర్ ఆ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్లు ఈటల చెప్పారని స్పష్టం చేశారు. కర్నాటక ఎన్నికల్లోను కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఆర్థిక సాయం చేస్తోందన్నారు. 

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. బీఆర్ఎస్ వద్ద కాంగ్రెస్ డబ్బు తీసుకున్న మాట వాస్తవం అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోను ఇదే అంశంపై ప్రచారం జరిగిందని, అక్కడి ఓటర్లు కూడా దీనిపై చర్చించుకున్నారని వెల్లడించారు.
Bandi Sanjay
Etela Rajender
Revanth Reddy

More Telugu News