Elon Musk: జనాభాలో నెం.1గా భారత్.. మస్క్ రియాక్షన్ ఇదీ

  • త్వరలో జనాభా పరంగా నెం.1గా భారత్
  • చైనాను అధిగమించి అగ్రస్థానం చేరుకోనున్న ఇండియా
  • తాజా పరిణామంపై ఎలాన్ మస్క్ స్పందన
  • దేశం తలరాతను నిర్ణయించేది జనాభానే అని వ్యాఖ్య
Demographics is destiny Musk reacts to India becoming most populous country in world

ఈ ఏదాది ప్రథమార్థం ముగిసేసరికి భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుందని ఐక్యరాజ్య సమితి తాజాగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ పరిణామంపై ట్విట్టర్, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తాజాగా స్పందించారు. జనాభానే దేశ తలరాతను నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ‘డెమోగ్రాఫిక్స్ ఈజ్ డెస్టినీ’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

దేశాభివృద్ధికి జనాభా పెరుగుదల అత్యంత కీలకమని విశ్వసించే ఎలాన్ మస్క్ తానే స్వయంగా గంపెడు మంది సంతానాన్ని కన్నారు. ప్రస్తుతం ఆయనకు తొమ్మిది మంది పిల్లలున్నారు. జనాభా తగ్గితే మానవ సమాజాలు అంతరించిపోతాయని మస్క్ గతంలో హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ మార్పుల కంటే జనాభా తగ్గుదలతోనే అధిక ప్రమాదమని అభిప్రాయపడ్డారు. 

ఇక 1950ల నుంచి ఐక్యరాజ్య సమితి ప్రపంచజనాభా లెక్కలను సేకరిస్తోంది. వీటి ఆధారంగా దేశాల జాబితాను విడుదల చేస్తోంది. అయితే, ఈ జాబితాలో భారత్ నెం.1 స్థానానికి చేరుకోనుండటం ఇదే తొలిసారి. అత్యధిక జనాభా గల దేశంగా చైనా కొన్నేళ్ల పాటు అగ్రస్థానంలో నిలిచింది. కానీ, అధిక జనాభాతో సమస్యలు తప్పవనుకున్న చైనా 1980ల్లో  ‘వన్ చైల్డ్ పాలసీ’ అమల్లోకి తెచ్చింది. ఒకరికంటే ఎక్కువ మంది సంతానాన్ని కనొద్దంటూ జంటలపై ఆంక్షలు విధించింది. అయితే, అక్కడి జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో అనర్థాలు తప్పవని గ్రహించిన చైనా ప్రభుత్వం వన్ చైల్డ్ విధానానికి 2016లోనే ఫుల్ స్టాప్ పెట్టింది. ప్రస్తుతం యువ జంటలు కనీసం ముగ్గురిని కనాలని ప్రోత్సహిస్తోంది.

More Telugu News