Punjab: నెల రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన ఖలిస్థానీ నేత అమృత్‌పాల్ సింగ్

 Pro Khalistani Leader Amritpal Singh arrested
  • పంజాబ్‌లోని మోగాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • అసోంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలింపు
  • నెల రోజులుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడు
పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఖలిస్థానీ సానుభూతి పరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మార్చి 18 నుంచి పరారీలో ఉన్న అమృత్‌పాల్‌ను పోలీసులు ఈ తెల్లవారుజామున పంజాబ్‌ మోగాలోని రోడే గ్రామంలో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను అసోంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలిస్తున్నారు. ఆయన సంస్థకు చెందిన ఇతర సభ్యులు కూడా అదే జైలులో ఉండడంతో అమృత్‌పాల్‌ను కూడా అక్కడికే తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు అమృత్‌పాల్‌ను అరెస్ట్ చేశారు. పంజాబ్ పోలీసులు, జాతీయ నిఘా విభాగం అధికారులు సంయుక్తంగా అమృత్‌పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, గత నెల 19న అమృత్‌పాల్ సన్నిహితులు ఇద్దరిని పంజాబ్, ఢిల్లీ పోలీసులు మొహాలీలో అదుపులోకి తీసుకున్నారు. 

అమృత్‌పాల్ సింగ్‌ సన్నిహితుడు లవ్‌ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ సింగ్‌‌ను ఓ కిడ్నాప్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విడిపించుకోవాలన్న అమృత్‌పాల్ పిలుపు మేరకు ఫిబ్రవరి 23న యువత అమృత్‌సర్ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్ స్టేషన్‌పై దాడి చేసింది. దీంతో యువతను రెచ్చగొట్టారంటూ అమృత్‌పాల్‌పై కేసు నమోదైంది. ఆ తర్వాత అతడి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. అయితే, ఎప్పటికప్పుడు వేషాలు మారుస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతూ వచ్చిన అమృత్ పాల్ పోలీసులకు సవాలు విసిరాడు. 

దీంతో అతడు పరారీలో ఉన్నట్టు మార్చిలో పోలీసులు ప్రకటించారు. అలాగే, అతడిపై లుక్ అవుట్ నోటీసు, నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేశారు. తాజాగా ఈ తెల్లవారుజామున అమృత్‌పాల్ పోలీసులకు చిక్కాడు.
Punjab
Amritpal Singh
Khalistan
Lovepreet Toofan

More Telugu News