Revanth Reddy: రాజేంద్రా... నన్నే అమ్ముడుపోయావ్ అంటావా!: ఏడ్చేసిన రేవంత్ రెడ్డి

  • నా ఆస్తి అంతా పెట్టి కేసీఆర్ పైన కొట్లాడుతానన్న కాంగ్రెస్ చీఫ్
  • ఈటలకు కన్నీళ్ల విలువ తెల్వదు అంటూ రేవంత్ రెడ్డి భావోద్వేగం
  • కట్ డ్రాయర్ మిగిలినా కేసీఆర్ తో కొట్లాడుతానని వ్యాఖ్య
  • నా వెంట్రుకను కూడా కొనలేరని ఘాటైన విమర్శలు చేసిన రేవంత్
  • అందరితో మాట్లాడినట్లు నాతో వద్దంటూ ఈటలకు హెచ్చరిక
  • నోటీసులు వస్తే నీలా లొంగిపోలేదని విమర్శించిన కాంగ్రెస్ నేత
Tears in Revanth Reddy eyes while talking Etala

"ఈటల రాజేంద్రా... నన్ను కేసీఆర్ కు అమ్ముడు పోయావ్ అంటావా.. నా ఆస్తి అంతా పెట్టి అధికార పార్టీ పైన కొట్లాడుతా" అంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ క్రమంలో భావోద్వేగాలకు లోనై కంటతడి పెట్టారు.. తాము కేసీఆర్ నుండి రూ.25 కోట్లు కాదు కదా... ఒక్క పైసా కూడా తీసుకోలేదని చెబుతూ రేవంత్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద ప్రమాణం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈటల రాజేందర్ పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. మాట్లాడుతున్న సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు... ఓ సమయంలో కళ్లు తుడుచుకోవడం కనిపించింది. ఈటల పైన పలు సందర్భాల్లో పరుషపదజాలం ఉపయోగించారు. 

తన ఆస్తి అంతా పోయినా... కట్ డ్రాయర్ పైన కూడా కేసీఆర్ తో పోరాడుతానని చెప్పారు. తమ కుటుంబం మొత్తం పోరాటానికే సిద్ధంగా ఉందన్నారు. తమ నాలుగు తరాల వరకు వారి పైన పోరాటం చేస్తామన్నారు. తాను చేతకానితనంతో కన్నీళ్లు పెట్టలేదని, ఆవేదనతో కంటతడి పెట్టినట్లు చెప్పారు. 

భయం తన రక్తంలో లేదని, తన చివరి రక్తపు బొట్టు వరకు కేసీఆర్ తో పోరాటం తప్పదన్నారు. రాజేంద్రా... నాపై ఇష్టారీతిన మాట్లాడి, తెలంగాణ సమాజం ముందు తలదించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. మున్ముందు ఎవరిని ఎవరు గద్దె దించుతారో తెలుస్తుందన్నారు. రాజేంద్రా.. అందరితో మాట్లాడినట్లు నాతో యథాలాపంగా మాట్లాడవద్దన్నారు.

కేసీఆర్ తనను కొన్నాడని ఈటల ఆరోపించారని, కానీ తన వెంట్రుకను కూడా వారు కొనలేరని చెప్పారు. నేను అమ్ముడుపోయానంటే ఊరుకునేది లేదు రాజేంద్రా అని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. మరోసారి ఇలా మాట్లాడితే బాగుండదన్నారు. 

ప్రశ్నించే గొంతుల మీద ఈటెల దాడి చేస్తున్నారని, ఆయన వైఖరి తెలంగాణ సమాజానికి నష్టమా? కాదా? ఆలోచించుకోవాలన్నారు. తన జీవిత లక్ష్యమే కేసీఆర్ ను గద్దె దించడమని గద్గద స్వరంతో చెప్పారు. 

తాను జైలుకు వెళ్లినా కూడా కేసీఆర్ పైన పోరాటం ఆపలేదన్నారు. నోటీసులు వస్తే నీలా ఎవరి వద్దకో వెళ్లి లొంగిపోలేదని దుయ్యబట్టారు. "రాజీ నా రక్తం లేదు.. భయం నా ఒంట్లో లేదు" అని అన్నారు. 

నువు చేరిన పార్టీలో నీ గుర్తింపు కోసం, కుర్చీ కోసం కక్కుర్తిపడి కేసీఆర్ పైన పోరాడుతున్న నా మీద అబద్దపు ప్రచారం చేస్తావా? అని నిలదీశారు. మా పోరాటానికి ప్రశంసించకపోయినా పర్వాలేదు... కానీ ఇలాంటి ఆరోపణలు వద్దని హితవు పలికారు. "ఇరవై ఏళ్లు కేసీఆర్ దుర్మార్గంలో సాక్షివో.. బాధితుడివో... పాలుపంచుకున్నావో... కానీ నీ పట్ల ఇదివరకు సానుభూతి ఉండేది" అని పేర్కొన్నారు.

తన జీవితం ఏమీ వడ్డించిన విస్తరీ కాదని, కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటడం కోసం తొమ్మిదేళ్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని చెప్పారు. కేసీఆర్ దండుపాళ్యం ముఠాలు తన స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూసినా కొట్లాడుతూనే ఉన్నానని చెప్పారు. కేసీఆర్ ముసుగు వేసుకొని ఈటల రాజకీయం చేస్తున్నారన్నారు. ఈటలకు కన్నీళ్ల విలువ తెలియదన్నారు.

More Telugu News